ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఇటీవల విడుదలైన అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకురాళ్ళ (ఆయా) ఉద్యోగ నోటిఫికేషన్లో ఏజెన్సీ (షెడ్యూల్డ్) గ్రామాలలోని పోస్టులను కేవలం స్థానిక ఆదివాసి (ST) మహిళలతోనే 100% శాతం భర్తీ చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా అధ్యక్షులు పర్షిక సతీష్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పర్సిక సతీష్ మాట్లాడుతూ.. ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతాల పరిధిలోకి వచ్చే ఏజెన్సీ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలలో స్థానిక గిరిజన మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, 1/70 చట్టం మరియు స్థానిక రిజర్వేషన్ల ప్రకారం ఆదివాసి మహిళలకే ఈ ఉద్యోగాలు దక్కాలని స్పష్టం చేశారు.
వెంకటాపురం మండలంలోని ఏజెన్సీ నోటిఫికేషన్ గ్రామాల్లో వంద శాతం స్థానిక ఆదివాసి మహిళలకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, గిరిజన ప్రాంతాల రక్షణ కొరకు ఉన్న జీవోలు, చట్టాలను పక్కాగా అమలు చేస్తూ ఈ నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఆయన కోరారు. అర్హులైన స్థానిక గిరిజన మహిళలకు అన్యాయం జరగకుండా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు.
ఏజెన్సీ గ్రామాల హక్కులను కాలరాసే విధంగా అధికారులు వ్యవహరిస్తే, ఆదివాసి మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.












