కొత్తపల్లి, 4 July
చర్ల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గ్రామస్తులు తమ గ్రామాభివృద్ధికి అరుదైన చొరవ చూపారు. అంగన్వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయానికి సొంత భవనాలు లేకపోవడంతో, ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వ భూమిని చదును చేసి నిర్మాణాలకు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ట్రాక్టర్ యజమానులు, రైతులు, యువకులు, పెద్దలు భాగస్వాములయ్యారు.
ప్రభుత్వం చేయాల్సిన పనులకు ప్రజలే ముందుకు వచ్చి తమ గ్రామ అభివృద్ధికి నాంది పలుకుతున్న అరుదైన ఘటన చర్ల మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎన్నో సంవత్సరాలుగా అంగన్వాడీ కేంద్రానికి, గ్రామ పంచాయతీ కార్యాలయానికి సొంత భవనాలు లేకపోవడంతో అద్దె భవనాల్లోనే నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామంలో అనువైన ప్రభుత్వ స్థలం లేకపోవడం వల్ల శాశ్వత భవనాల నిర్మాణం కూడా సాధ్యం కాలేదు.
ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సంకల్పించిన గ్రామస్తులు అందరూ ఒకే వేదికపైకి వచ్చారు. గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయం వెనుక ఉన్న సుమారు 30 అడుగుల లోతైన ప్రభుత్వ భూమిని తమ సొంత ఖర్చులతో చదును చేసి నిర్మాణాలకు అనువుగా మార్చాలని నిర్ణయించారు.
గ్రామంలో ఉన్న ట్రాక్టర్ల యజమానులు తమ వాహనాలను ఉచితంగా అందించగా, రైతులు వ్యవసాయ పనులను సైతం కొంతకాలం పక్కనపెట్టి ఈ పనిలో నిమగ్నమయ్యారు. యువకులు, పెద్దలు కలిసి శ్రమదానం చేస్తూ ప్రభుత్వ భూమిని చదును చేస్తున్నారు. గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం ప్రజలంతా ఏకమై పనిచేస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
గ్రామస్తుల కథనం ప్రకారం, ఈ స్థలంలోనే భవిష్యత్తులో అంగన్వాడీ కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రానికి శాశ్వత భవనం అత్యవసరమని వారు పేర్కొన్నారు.
"గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం మాత్రమే ఎదురు చూడకుండా, మన గ్రామ సమస్యలను మనమే పరిష్కరించుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. గ్రామ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా శ్రమదానం చేస్తున్నారు" అని గ్రామస్తులు తెలిపారు.
ప్రజల ఐకమత్యం, సేవాభావానికి నిదర్శనంగా నిలుస్తున్న ఈ కార్యక్రమాన్ని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సామాజికవేత్తలు అభినందిస్తున్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు రావడం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఎడారి. భూపతి, బుట్టా. శ్రీనివాస్, కూనారపు. నాగయ్య, కొప్పుల. మల్లయ్య, ఉపట్ల. సత్యనారాయణ, బూరుగడ్డ. లక్ష్మణరావు, కూనారపు. సుబ్బయ్య, గుమ్మ. నాగేశ్వరరావు గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.












