Charla, 15 July
విద్య ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని, అందుకు సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వేమాల ప్రసాద్ విద్యార్థులకు సూచించారు. తన కుమారుడి జన్మదినం సందర్భంగా వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం నిలయ విద్యార్థులకు దుస్తులు, విద్యా సామగ్రి, పండ్లను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విద్య ద్వారానే ప్రయోజకులు కావాలని, అందుకు ఇప్పటి నుంచే ఖచ్చితమైన ప్రణాళిక రూపొందించుకోవాలని ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న వేమాల ప్రసాద్ ఉద్బోదించారు. ప్రసాద్ - సునీత దంపతుల ద్వితీయ కుమారుడు నిహాల్ జన్మదినం సందర్భంగా వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం నిలయ విద్యార్థులకు ఒక జత దుస్తులతో పాటు కంబాక్స్ లు, పెన్నులు, పెన్సిల్స్, పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వనవాసీ కొమరం భీం నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రసాద్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తాము ఏమి కావాలో చిన్ననాటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని అన్నారు. ఇక్కడి విద్యార్థుల క్రమశిక్షణ తనకు ఎంతగానో ఆకట్టుకుందని, అందుకే వెంకటాపురంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ, తమ కుమారుని జన్మదినం ఇక్కడ జరుపుకుని వితరణలను అందజేశామని తెలిపారు.
కొమరం భీం నిలయ కార్యదర్శి మురళీకృష్ణ మాట్లాడుతూ, జన్మదినం, శుభకార్యాలతో పాటు ఇతర సందర్భాలలో డబ్బు వృధా చేయకుండా విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ సంస్థ ప్రభుత్వ నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం, ఇతర సౌకర్యాలను పొందదని, కేవలం దాతల సహకారంతోనే నడుస్తుందని వెల్లడించారు. గిరిజనుల అభ్యున్నతి కొరకు ఈ సంస్థ దేశవ్యాప్తంగా విద్యార్థి నిలయాలను నిర్వహిస్తోందని తెలిపారు. వనవాసీ విద్యార్థులకు దాతలు అందజేస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగపరుచుకొని, దాతల నమ్మకాన్ని వమ్ముచేయకుండా చదువుపై దృష్టిసారించి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యతోనే వినయం, విదేయత వస్తుందని, కుటుంబంలో ఒక్కరు చదువుకొని జీవితంలో స్థిరపడితే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అందుకే తాము విద్యపై దృష్టిసారించి, పేద విద్యార్థులకు సహకారమందించడంతో పాటు వారిని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. గిరిజన విద్యార్థుల సంక్షేమం, అభ్యున్నతి కొరకు పాటుపడే సంస్థకు దాతలు తమవంతు సహకారమందించి విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో వేమాల సునీత, వనవాసీ జిల్లా సహ కార్యదర్శి గోగికార్ రాంలక్ష్మణ్, జిల్లా సంఘటనా సహ కార్యదర్శి గొంది శోభన్ బాబు, కొమరం భీం నిలయ ప్రముఖ్ ఆకుల సాంబయ్య, శబరి బాలికా నిలయ ప్రముఖ్ వరలక్ష్మి, మడకం చందు, కూడం ఉంగయ్య, ప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.











