ములుగు, 14/07/2026
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పలు ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ, బాలవికాస్ సంస్థల సహకారంతో నూతన బోర్వెల్స్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం నేపథ్యంలో గిరిజనుల దాహార్తిని తీర్చేందుకు ఈ సంస్థలు ముందుకు వచ్చాయి.
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలనే లక్ష్యంతో, బాలవికాస్ సంస్థ సహాయ సహకారాలతో కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ముత్తారం, సూరవీడు కాలనీ మరియు పలు ఏజెన్సీ ప్రాంతాల్లో నూతన బోర్వెల్స్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం పట్టించుకోని ఆదివాసి గిరిజన గ్రామాలలో స్వచ్ఛంద సేవా సంస్థలు గిరిజనుల త్రాగునీటి సమస్యలను పరిష్కరించే దిశగా పలు నూతన చేతి పంపు బోర్లను ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న కొండకోన పరివాహక ప్రాంతాల్లో నీటికి, గూటికి దూరమైన గిరిజనులకు చేయూతగా బాలవికాస్ సంస్థ అన్నివేళలా అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తోందని తెలిపారు. ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే, వాటిని పరిష్కరించే దిశగా తాము ముందంజలో ఉంటామని తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి బాలవికాస్ సంస్థ తరఫున ప్రశాంత్, కాపెడ్ సంస్థ తరఫున డైరెక్టర్ బ్రదర్ కె. లూర్దు రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా కరువు పరిస్థితుల్లో స్వచ్ఛమైన తాగునీరు ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండటం అత్యంత అవసరమని వారు పేర్కొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బాలవికాస్ సంస్థ సహకారంతో ఈ బోర్వెల్స్ ఏర్పాటు చేశామని, గ్రామ ప్రజలు వీటిని తమ సొంత ఆస్తిగా భావించి, జాగ్రత్తగా వినియోగించుకోవడంతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా సంరక్షించాలని సూచించారు.
ముత్తారం గ్రామం మరియు సూరవీడు కాలనీ ప్రజలు ఈ బోర్వెల్స్ ఏర్పాటు చేయడం వల్ల తమ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. ఈ క్లిష్టమైన కరువు సమయంలో తమ గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించిన బాలవికాస్ సంస్థ మరియు క్యాఫెడ్ సంస్థలకు గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రజల సంక్షేమం, తాగునీటి భద్రత మరియు సమాజ అభివృద్ధి కొరకు ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ముత్తారం గ్రామ సర్పంచ్, కార్యదర్శి, సూరవీడు కాలనీ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.










