Charla, జూలై 7
మన్యం బిడ్డలు నేటితరం ఏకలవ్యులుగా ఎదగాలని, చదువే వారి జీవితాలను మార్చే వజ్రాయుధమని శ్రీనృసింహ సేవా వాహిని సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి అన్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది విద్యార్థులకు విద్యా కిట్లను అందిస్తూ, వారి చదువులకు అండగా నిలుస్తున్నామని ఆయన తెలిపారు.
మన్యం బిడ్డలు నేటితరం ఏకలవ్యులుగా తయారుకావాలని, చదువు మాత్రమే జీవితాలను మార్చే వజ్రాయుధమని శ్రీనృసింహ సేవా వాహిని సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి అన్నారు. పల్లెల్లో అక్షరజ్యోతులు వెలిగిస్తున్న మహర్షిగా ఆయన మన్యం బిడ్డలకు సుపరిచితులు. ప్రతినిత్యం మన్యంలో అనేక ఆధ్యాత్మిక, సామాజిక, సేవా కార్యక్రమాలు చేస్తూ, ధార్మిక చింతన వైపు అడుగులు వేస్తున్న ఆయన ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
కొడుకులు లేనివారు చైతన్య స్వామివారే తమ ఇంటి పెద్దకొడుకు అని భావిస్తూ, ఏ కష్టం వచ్చినా తమ స్వామి వస్తాడని ఎదురుచూసే పల్లెలు ఎన్నో ఉన్నాయి. ప్రతి సంవత్సరం పుస్తకాల బ్యాగులు అందించే చైతన్య గురువుగారు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూసే మన్యం బిడ్డలు ఎందరో ఉన్నారు. ప్రతి సంవత్సరం 'విద్యా వికాసం' పేరుతో వేలాది మంది విద్యార్థులకు బ్యాగులు, నోట్ పుస్తకాలు, ఇతర స్టేషనరీ సామాగ్రిని కిట్లుగా ఏర్పాటు చేసి, గత కొన్నేళ్లుగా గిరిపుత్రులకు అందజేస్తూ మన్యంలో విద్యావెలుగులు నింపుతున్నారు.
ఈ సందర్భంగా డా. కృష్ణ చైతన్య స్వామి మాట్లాడుతూ, విద్య ద్వారా మాత్రమే పేదరికం పోతుందని, మన్యం బిడ్డలు గొప్పగొప్ప చదువులు చదివి వివిధ రంగాలలో దేశానికి సేవ చేసే శక్తులుగా ఎదగాలని అన్నారు. పేద విద్యార్థులకు శ్రీనృసింహ సేవా వాహిని సంస్థ ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని తెలిపారు. అందులో భాగంగానే చర్ల మండలంలోని కుర్నపల్లి, బూరుగుపాడు, ఆర్ కొత్తగూడెం, చింతగుప్ప పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు 'విద్యా వికాసం' కిట్లు అందజేయడం జరిగిందని చెప్పారు.
ఉన్నత చదువులు చదువుతూ ఆర్థిక పరిస్థితి బాగోలేక మధ్యలోనే చదువులు ఆపేస్తున్న ఎంతోమంది పేద హరిజన, గిరిజన విద్యార్థులకు ప్రతి సంవత్సరం కొంత ప్రోత్సాహకంగా సహాయ సహకారాలు అందిస్తూ వారి విద్యావ్యాప్తికి సహకారం అందిస్తున్నామని, ప్రతి పేద పిల్లవాడు ఒక విద్యా కుసుమంగా తయారై లోకానికి సేవ చేయాలని అన్నారు. గతంలో ఇదే ప్రాంతంలో చిరిగిన సంచుల్లో పుస్తకాలు పెట్టుకుని పాఠశాలకు వెళ్లడానికి, వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్న పిల్లలు, రెక్కాడితే డొక్కాడని నిరుపేద బిడ్డలు ఎన్నో అవస్థలు పడుతున్నారని భక్తుల ద్వారా సమాచారం తెలుసుకుని చలించి తీసుకున్న నిర్ణయమే నేడు వేలాదిమంది విద్యార్థులకు అండదండలుగా నిలిచిందని గుర్తుచేశారు. మున్ముందు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతి మారుమూల పల్లెల్లో ఈ 'విద్యా వికాసం' కిట్లను సంస్థ ఆధ్వర్యంలో అందజేయనున్నామని, దేవుడు ఈ జన్మను ఇచ్చింది లోకానికి సేవ చేయడానికేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి, పాఠశాలల సిబ్బంది, ఆర్ కొత్తగూడెం సర్పంచ్ తుర్రం రవికుమార్, కూరపాటి వీర్రాజు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.












