ములుగు, 2026-07-25
ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లోని ఉద్యోగాలను సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్, జీవో నెం.57 ప్రకారం ఐటీడీఏ ద్వారానే భర్తీ చేయాలని, అంగన్వాడీ టీచర్, వర్కర్ల నియామకాలు, బదిలీలు, పదోన్నతుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తుడుం దెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం (ఏఎస్యూ) నాయకులు జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ అతిథి గృహంలో గురువారం జాతీయ తెలంగాణ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను తుడుం దెబ్బ, ఆదివాసీ విద్యార్థి సంఘం (ఏఎస్యూ) జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆదివాసీల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ జాతీయ ఉపాధ్యక్షుడు పొడెం బాబు, ఏఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి మాట్లాడుతూ, ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లోని 29 శాఖల్లో 155 రకాల ఉద్యోగాలను సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్, జీవో నెం.57 ప్రకారం ఐటీడీఏ ద్వారానే భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ఆదివాసీ నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతోందని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖల ద్వారా వెంటనే నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసి, అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా చట్టం తీసుకురావాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, భారత రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసులపై అటవీ శాఖ అధికారులు దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ఆదివాసీల హక్కులను పరిరక్షించే చర్యలు చేపట్టాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన గిరిజనుల విషయంలో కూడా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన వారికి ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్లు, వర్కర్ల నియామకాలు, బదిలీలు, పదోన్నతుల వ్యవహారంపై ఆదివాసి హక్కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడు పోడేం బాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాప్కాపురం, మానస పల్లి లో నిభందనలు గాలికి వదిలేస్తూ ముడుపులు తీసుకుని అక్రమాల కు పాల్పడి అర్హులైన మహిళలకు అన్యాయం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో అమలులో ఉన్న జి.ఓ.ఎంఎస్. నెం.183, తేదీ 27-07-1987 ప్రకారం స్థానిక ఆదివాసీలకే ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించాల్సి ఉండగా, ఇటీవల విడుదలైన అంగన్వాడీ టీచర్, వర్కర్ నియామకాల నోటిఫికేషన్లో ఆ వెసులుబాటు కల్పించలేదని ఆరోపించారు.
అలాగే ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గోవిందరావుపేట, వాజేడు మండలాల్లోని ఏజెన్సీ గ్రామాలకు నాన్-షెడ్యూల్ ప్రాంతాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు, పదోన్నతులు కల్పించారని పేర్కొన్నారు. ఈ బదిలీలు, పదోన్నతులను వెంటనే రద్దు చేసి, బాధ్యులపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యల వల్ల షెడ్యూల్ ప్రాంతాల్లో చదువుకున్న ఆదివాసీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు దూరమవుతున్నాయని, ఇది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.












