ములుగు, 2 August
ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని నిరసన కార్యక్రమాలతో పాటు బ్లాక్ డేగా నిర్వహించాలని ఆదివాసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. ఆదివారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేశారు. ఏజెన్సీ చట్టాల అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని నిరసన కార్యక్రమాలతో పాటు బ్లాక్ డేగా నిర్వహించాలని ఆదివాసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించింది. ఆదివారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్బి గెస్ట్ హౌస్ ఆవరణంలో ఆదివాసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ తీర్మానం చేశారు. ఆదివాసి సంఘాల నాయకులు ముక్తకంఠంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా తుడుం దెబ్బ జాతీయ నాయకులు యసం రాజు, గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి, ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోర్స నర్సింహమూర్తి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ చట్టాల అమలు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. 1/70 చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఏజెన్సీ ప్రాంతాలకు వలసలుగా వస్తున్న గిరిజనేతరులు అక్కడి చట్టాలను తొలగించాలని కోరడం సరికాదని, ఇది తల్లి పాలు తాగి రొమ్మును తన్నినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1700 మంది గిరిజనేతరులు కోర్టును ఆశ్రయించారని, ఇందులో వెంకటాపురం మండలానికి చెందిన అధికార పార్టీ వ్యక్తి ప్రధాన పాత్ర పోషించడం విడ్డూరమని అన్నారు. ఈ విషయంలో ఆదివాసి ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించాలని, లేదంటే ఏజెన్సీ ప్రాంత రిజర్వేషన్లు దెబ్బతిని, వారి రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.
3 జీవోను పునరుద్ధరించి, షెడ్యూల్ ఏరియాలో 100 రిజర్వేషన్ ఆదివాసికే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆగస్టు 9న జరిగే ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆదివాసి యువతీయువకులు, సంఘాలు, ఉద్యోగ, మహిళా సంఘాలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జీఎస్పీ జిల్లా అధ్యక్షులు పూనెం ప్రతాప్, ఏఎన్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కుంజ మహేష్, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు, సిద్ధబోయిన సర్వేశ్వరరావు, బిక్షపతి, కనితి విజయ్, మండల నాయకులు కనితి వెంకటకృష్ణ, తురస చంటి, తెలంగాణ ఆదివాసి భూమిపుత్ర సంఘం నాయకులు ఉండం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.









