ఎటూరునాగారం, 1 August
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో జూలై 31న తుడుం దెబ్బ ఆధ్వర్యంలో జరిగిన కోఆర్డినేషన్ సమావేశంలో ఆగస్టు 24న ఐటీడీఏ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. గిరిజన సంక్షేమ నిధుల దుర్వినియోగం, ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని గిరిజన భవన్లో జూలై 31న తుడుం దెబ్బ ఆధ్వర్యంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు, యువజన ప్రతినిధులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదివాసి హక్కుల పోరాట సమితి–తుడుం దెబ్బ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షుడు పొదేం బాబు, వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏలు సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో గిరిజనుల సంక్షేమం కోసం పనిచేయాల్సి ఉండగా, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గిరిజన సంక్షేమ నిధులు సక్రమంగా వినియోగం కావడం లేదని ఆరోపించారు. అలాగే ఐటీడీఏ పరిధిలోని 29 శాఖల ఉద్యోగాలను గిరిజనులతోనే భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, జీవో నెం.3ను పునరుద్ధరించాలని, 1/70 చట్టాన్ని, పేసా చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఐటీడీఏ పరిధిలోని 29 శాఖల ఉద్యోగాలను ఐటీడీఏ ద్వారానే భర్తీ చేయాలని, 1980 చట్టం ప్రకారం వడ్డీ వ్యాపారాన్ని నిరోధించాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 24న ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం వద్ద చేపట్టనున్న శాంతియుత ముట్టడిని విజయవంతం చేయాలని వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
సమావేశం అనంతరం ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం విజయవంతానికి జిల్లా వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లబోయిన లక్ష్మణరావు దొర, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు తదితర నాయకులు, యువత పాల్గొన్నారు.










