వెంకటాపురం, 2026-06-05
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం, చవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతిపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆదివారం ములుగు జిల్లా ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో భారీ కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది ఆదివాసీలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం, చవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతిపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆదివారం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో భారీ కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. కొమరం భీమ్ విగ్రహానికి మహిళలు పూల దండలు వేసి ర్యాలీని ప్రారంభించారు. వందలాది మంది ఆదివాసీలు పాల్గొన్న ఈ ర్యాలీ వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి మీదుగా సాగింది. దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని వారు నినాదాలు చేశారు.
ర్యాలీ అనంతరం ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొర్స నర్సింహా మూర్తి మాట్లాడుతూ, ఊకె శిరీషపై జరిగిన దాడి అత్యంత అమానవీయమైన, హేయమైన చర్య అని అన్నారు. గదిలో ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశారని, ఆమె ప్రైవేట్ భాగాలను కత్తులతో కోసినట్లు తెలిపారు. ఇది ఒక్కరు చేసిన పని కాదని, ఇది గ్యాంగ్ రేప్, మర్డర్ అని ఆరోపించారు. ఈ ఘటనలో ఆసుపత్రి యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉందని విమర్శించారు.
అరకొర విద్యతో అడవి దాటి ఆధునిక ప్రపంచంలో ఉపాధి కోసం వస్తున్న ఆడబిడ్డలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడవిలో ఉంటే అన్నలుగా చూస్తారు, కానీ అడవి దాటి వస్తే ఇలా హత్యలు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ దేశంలో ఆదివాసీలకు రక్షణ లేదని, మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నా, వాటి అమలులో లోపాలున్నాయని అన్నారు. ఆదివాసీ బిడ్డలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా ఎందుకు ఎన్కౌంటర్లు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
వేల కోట్ల రూపాయలు గిరిజన ఉప ప్రణాళిక నిధులు కేటాయిస్తున్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలు ఉన్న చోటే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించడం లేదని ఆయన ప్రశ్నించారు. అడవి బిడ్డలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఏఎన్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు ఆరోపించారు. ఆడపిల్లలు పనిచేసే చోట, చదువుకునే చోట రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. రాష్ట్ర రాజధానిలోనే మహిళలకు రక్షణ లేకపోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు.
ర్యాలీకి మద్దతుగా వచ్చిన ఏఎస్పీ, జిల్లా అధ్యక్షులు పర్షిక సతీష్ మాట్లాడుతూ, ఊకె శిరీషపై జరిగిన దాడి యావత్తు ఆదివాసీ సమాజంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఆదివాసీ మహిళలకు కనీస రక్షణ కరువైందన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీ అడ్వకేట్ అసోసియేషన్ నాయకులు చింత సమ్మయ్య మాట్లాడుతూ, ఈ ఘటనపై ప్రత్యేక విచారణ చేపట్టి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, వాటి అమలు తీరులో లోపాల కారణంగా దాడులు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు.








