ములుగు, 2026-06-05
తుక్కుగూడెంలో దారుణ హత్యకు గురైన నర్సు ఉకే శిరీష కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క పరామర్శించారు. బాధితురాలి స్వగ్రామం చౌటిగూడెంలో ఆమె తల్లిని, కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తుక్కుగూడెంలో దారుణ హత్యకు గురైన నర్సు ఉకే శిరీష కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) పరామర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెంలోని శిరీష స్వగ్రామానికి మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు నునావత్ రాధాబాయితో కలిసి వెళ్లి, శిరీష తల్లిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. శిరీష చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
శిరీష హత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని మంత్రి సీతక్క అన్నారు. ఘటన తెలిసిన వెంటనే పోలీసు అధికారులతో, డీజీపీతో మాట్లాడి దర్యాప్తు పురోగతిని పర్యవేక్షించామని తెలిపారు. నిందితుడిని వెంటనే గుర్తించి అరెస్టు చేయడంలో పోలీసులు వేగంగా స్పందించారని పేర్కొన్నారు. నిందితుడికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేమని, కానీ శిరీష కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే తాను స్వయంగా శిరీష కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చానని మంత్రి తెలిపారు. అక్కా.. మీరు స్వయంగా వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పండి. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వండి అని ముఖ్యమంత్రి తనకు సూచించారని ఆమె పేర్కొన్నారు. అత్యంత నిరుపేద ఆదివాసీ కుటుంబానికి చెందిన శిరీష తన కాళ్లపై తాను నిలబడాలనే ఆశయంతో చదువుకుని నర్సుగా ఉద్యోగం చేస్తోందని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఆశతో హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగం చేస్తున్న యువతి ఇలాంటి దారుణ ఘటనకు బలికావడం అత్యంత బాధాకరమని అన్నారు.
బంగారు భవిష్యత్తు ఉన్న ఒక ఆదివాసీ బిడ్డ.. ఎన్నో అవాంతరాలను అధిగమించి జీవితంలో ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సమయంలో ఒక దుర్మార్గుడి చేతిలో ప్రాణాలు కోల్పోవడం జీర్ణించుకోలేకపోతున్నామని మంత్రి అన్నారు. శిరీష కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, కానీ ఆ కుటుంబం ఒంటరిగా లేదనే భరోసాను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కును అందజేస్తామని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.1 లక్ష, ఐటీడీఏ నుంచి రూ.30 వేల సహాయంతో పాటు, తాను, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వ్యక్తిగతంగా రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యులు కోరిన ఇందిరమ్మ ఇల్లు, జీవనోపాధి కోసం సాగు భూమి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద బాధిత కుటుంబానికి అందాల్సిన పరిహారాన్ని కూడా నిబంధనల ప్రకారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టణాలకు ఉపాధి కోసం వచ్చే ఆదివాసీ, గ్రామీణ ప్రాంతాల యువతులు, ముఖ్యంగా ఉద్యోగినుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి సీతక్క అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన రక్షణ చర్యలను బలోపేతం చేస్తామని చెప్పారు. పట్టణాల్లో పనిచేస్తున్న ఆదివాసీ యువతులు అత్యవసర పరిస్థితుల్లో సహాయం పొందేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.







