భద్రాద్రి కొత్తగూడెం, జూలై 23
చర్లలోని కొమరం భీం విద్యార్థి నిలయానికి యూఎస్ లోని ఎన్ఆర్ఐ దంపతులు ఇందుర్తి రాహుల్ - సుధారాణి రూ.15 వేల విలువైన బియ్యం, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, భోజన ప్లేట్లతో పాటు ఒక పూట భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వనవాసీ కల్యాణ పరిషత్ ప్రాంత కోశాధికారి నరసింహారెడ్డి మాట్లాడుతూ, విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ ముఖ్యమని విద్యార్థులకు సూచించారు.
విద్యతో పాటు సంస్కారం, క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని వనవాసీ కల్యాణ పరిషత్ ప్రాంత కోశాధికారి నరసింహారెడ్డి అన్నారు. వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయం విద్యార్థులకు చర్ల అటవీశాఖ కార్యాలయంలో సెక్షన్ అధికారిగా విధుల్లో ఉన్న ఇందుర్తి రాజేష్ సోదరుడు, యూఎస్ కు చెందిన ఎన్ఆర్ఐ దంపతులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇందుర్తి రాహుల్ - సుధారాణి దంపతుల రెండవ కుమారుడు శ్రేయాన్ బారసాల సందర్భంగా చర్లలోని కొమరం భీం విద్యార్థి నిలయానికి రూ.15 వేల విలువైన క్వింటా బియ్యం, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, భోజన ప్లేట్లతో పాటు ఒక పూట భోజనం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కొమరం భీం విద్యార్థి నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నరసింహారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. గిరిజనుల అభ్యున్నతి కోసం వనవాసీ సంస్థ విద్య, వైద్య రంగాలలో ఎనలేని కృషి చేస్తోందని వివరించారు. సంస్థ ప్రభుత్వం నుండి ఎటువంటి విరాళాలు సేకరించదని, కేవలం దాతల సహకారంతో నడుస్తుందని తెలిపారు. గిరిజన విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా నిలయాలను ఏర్పాటు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోందని పేర్కొన్నారు. రాహుల్ - సుధారాణి దంపతులు ఏడాదిలోపే విద్యార్థి నిలయానికి గ్రైండర్, బెడ్స్, బియ్యం, ఇతర అవసరాలను సమకూర్చడం సంతోషకరమని కొనియాడారు.
వనవాసీ ప్రాంత సంఘటన మంత్రి వేముక ఆంజనేయులు మాట్లాడుతూ, బ్రిటీష్ పాలకులు అవలంబించిన విద్యా వ్యతిరేక విధానాల కారణంగా రవిచంద్రశుక్ల ప్రోత్సాహంతో 1952లో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జస్ పూర్ లో గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కోసం సంస్థ ప్రారంభమైనట్లు వివరించారు. అనంతరం దేశభక్తి కలిగిన లక్షలాది మంది విద్యార్థులు సంస్థ ద్వారా తీర్చిదిద్దబడ్డారని తెలిపారు.
అటవీశాఖ సెక్షన్ అధికారి ఇందుర్తి రాజేష్ మాట్లాడుతూ, ఇక్కడి విద్యార్థుల క్రమశిక్షణ, వారు పఠించే సంస్కృత శ్లోకాలు అద్భుతమని పేర్కొన్నారు. ఇక్కడి విద్యార్థుల క్రమశిక్షణను ఇతరులు చూసి నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల గొప్పతనాన్ని తెలుసుకున్న తమ సోదరుడు రాహుల్ స్పందించి విద్యార్థులకు సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వస్తున్నారని వెల్లడించారు. తాము చదువుకున్న రోజులలో పడ్డ కష్టాలను ఇతరులు అనుభవించకూడదనే ఉద్దేశంతో పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు కూడా దాతల నమ్మకాన్ని నిలబెట్టేలా పట్టుదలతో చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. తాము ఉన్నత చదువులు చదవబట్టే నేడు ఈ స్థితిలో ఉన్నామని, దీనిని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని కోరారు.
వనవాసీ ప్రాంత మహిళా సహప్రముఖ్ పెద్దాడ మాట్లాడుతూ, విద్యార్థులు దాతలు అందించిన సహకారాన్ని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. పేద విద్యార్థుల చదువులకు పెద్ద ఎత్తున సహకరిస్తున్న దాతలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.










