Charla, జూలై 24
కెనడాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి పగడాల శ్రీహర్ష జన్మదినం సందర్భంగా, వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో కొమరం భీం, శబరి బాలికా విద్యార్థి నిలయాల విద్యార్థులకు బియ్యం, భోజనం, ఇతర సామగ్రిని అందజేశారు. విద్య జీవిత గమనాన్ని మార్చివేస్తుందని వనవాసీ కళ్యాణ పరిషత్ ప్రాంత సంఘటనా కార్యదర్శి వేముక ఆంజనేయులు అన్నారు.
విద్య జీవిత గమనాన్నే మార్చివేస్తుందని వనవాసీ కళ్యాణ పరిషత్ ప్రాంత సంఘటనా కార్యదర్శి వేముక ఆంజనేయులు అన్నారు. చర్ల వాసి, ప్రస్తుతం ఖమ్మంలో స్థిరపడిన పగడాల విజయ్ కుమార్ - కవిత దంపతుల కుమారుడు, కెనడాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి పగడాల శ్రీహర్ష జన్మదినం పురస్కరించుకుని వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో కొమరం భీం, శబరి బాలికా విద్యార్థి నిలయాల విద్యార్థులకు అర క్వింటా బియ్యం, ఒక పూట భోజనం, టూత్‌పేస్ట్, బ్రష్‌లు, పండ్లను అందజేశారు.
ఈ సందర్భంగా కొమరం భీం నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంజనేయులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చదువుతోనే సార్థకత ఉంటుందని, ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టిసారించి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇక్కడి నిలయ స్థితిగతులు, విద్యార్థుల క్రమశిక్షణ దాతలను ఆకట్టుకున్నాయని తెలిపారు. దీంతో అనేకమంది దాతలు చదువులకు సహకరించడం సంతోషకరమని పేర్కొన్నారు. వనవాసీ సంస్థ అవసరాలను తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు.
వనవాసీ జిల్లా సహ కార్యదర్శి గోగికార్ రాంలక్ష్మణ్ మాట్లాడుతూ, సంస్థ గిరిజనుల అభ్యున్నతి కొరకు పనిచేస్తుందని, ఇందుకోసం దేశవ్యాప్తంగా బాల, బాలికలకు అనేక వసతి గృహాలను ఏర్పాటు చేసి విద్యాబుద్ధులు నేర్పిస్తోందని వెల్లడించారు. తమ వసతి గృహాలలో విద్యతో పాటు వినయ విధేయతలు నేర్పుతారన్నారు. సంస్థ ప్రభుత్వ నుండి ఎటువంటి సహకారం తీసుకోదని, కేవలం దాతల ద్వారానే నడుస్తుందని తెలిపారు. దేశభక్తులను తయారు చేసే సంస్థకు మరింత మంది దాతలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. గిరిజనుల అభ్యున్నతి కొరకు సంస్థ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని వెల్లడించారు.
కార్యక్రమంలో నిలయ కమిటీ సహ కోశాధికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, కొమరం భీం నిలయ ప్రముఖ్ ఆకుల సాంభయ్య, శబరి బాలికా నిలయ ప్రముఖ్ వరలక్ష్మి, కరుణశ్రీ పాల్గొన్నారు.










