కాకినాడ, జూలై 4
కేంద్ర ప్రభుత్వ CEIR పోర్టల్ సహాయంతో కాకినాడ జిల్లా పోలీసులు పోయిన, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందిస్తున్నారు. 12వ విడత మొబైల్ రికవరీ మేళాలో భాగంగా రూ.1.20 కోట్ల విలువైన 602 ఫోన్లను ఎస్పీ జి.బిందు మాధవ్ బాధితులకు అందజేశారు.
కేంద్ర ప్రభుత్వ CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా పోయిన, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించే కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా పోలీసులు విజయవంతంగా కొనసాగిస్తున్నారు. 12వ విడత మొబైల్ రికవరీ మేళాలో భాగంగా రూ.1.20 కోట్ల విలువైన 602 మొబైల్ ఫోన్లను ఎస్పీ జి బిందు మాధవ్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు అందజేశారు.
పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా జిల్లా ఐటీ కోర్ బృందం IMEI ట్రాకింగ్, GPS ట్రేసింగ్, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ నిఘా, డేటా విశ్లేషణ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు నిర్వహించిన 12 విడతల్లో మొత్తం 4,603 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు, వాటి విలువ రూ.7.68 కోట్లుగా ఉందని ఎస్పీ తెలిపారు. మొబైల్ పోయిన వెంటనే www.ceir.gov.inలో ఫిర్యాదు నమోదు చేయాలని, సైబర్ మోసాలకు గురైతే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
మొబైల్ పోయిన వెంటనే బ్యాంకు ఖాతాలు, UPI సేవలను భద్రపరచడం, సిమ్ కార్డును బ్లాక్ చేయించడం, Google, Apple ID, బ్యాంకింగ్ యాప్‌లు, WhatsApp, సోషల్ మీడియా ఖాతాల పాస్వర్డ్లు మార్చుకోవాలని సూచించారు. అలాగే సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసే ముందు బిల్లు, బాక్స్, IMEI నంబర్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని, అపరిచితుల వద్ద నుంచి మొబైల్ కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు మహంతి కిషోర్ కుమార్, ఎస్ శ్రీనివాసరావు, ఎస్డీపీఓ పాటిల్ దేవరాజ్ మనీష్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కెవివి సత్యనారాయణ, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ డి దుర్గా శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.











