పామర్రు, 07-07-2026
వెంకటాపురం మండల కేంద్రంలో సీడీపీఓకు ఆదివాసి సంక్షేమ పరిషత్ మేమొరాండం సమర్పించింది. తుర్స వానిగూడెంలో అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాలను చేపడతామని పరిషత్ మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆరోపించారు.
వెంకటాపురం మండల కేంద్రంలో సీడీపీఓ గారికి ఆదివాసి సంక్షేమ పరిషత్ మేమొరాండం సమర్పించింది. ఈ సందర్భంగా పరిషత్ మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్డ్, పీసా చట్టం ప్రకారం ఆదివాసులకు సర్వ హక్కులు ఉన్నాయని, అయితే ప్రభుత్వాలు అడవి బిడ్డల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు.
ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, జల్ జంగిల్ జమీన్ (నీరు, అడవి, భూమి)పై ఆదివాసులకే సర్వాధికారాలు ఉన్నాయని రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్డ్, పీసా చట్టం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ప్రభుత్వాలు అడవి బిడ్డల నోటి కాడ కూడును లాక్కుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏజెన్సీ గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలు పిల్లల భవిష్యత్తు, అక్కాచెల్లెమ్మల ఉపాధి కోసం ఏర్పడ్డాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లో ఆదివాసులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకపోతే ఉద్యమాలను చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వెంకటాపురం మండలం ఉప్పెడు వీరాపురం (గ్రా.పం) పరిధిలోని తుర్స వానిగూడెం గ్రామంలో 100 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. ఈ గ్రామంలో 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. 15 మంది పసిపిల్లలు, తల్లులు, గర్భిణీ స్త్రీలు ఉన్నప్పటికీ, అంగన్వాడి కేంద్రం లేకపోవడం ప్రభుత్వ అధికారుల తప్పిదమేనని అన్నారు. తక్షణమే అంగన్వాడి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, తుర్స శ్రీనివాసు, బాలకృష్ణ, ఆదిలక్ష్మి, మానస, బొగ్గుల కమల, అనసూర్య, తుర్స కవిత, సంజీవరాణి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.











