ములుగు, 2026-07-30
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగు వద్ద భారీ వర్షాల కారణంగా కారుతో సహా డ్రైవర్ గల్లంతైన విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అధికారులు హెచ్చరికలు జారీ చేసినా.. నిర్లక్ష్యంగా వాగు దాటే ప్రయత్నంలో ఈ దుర్ఘటన జరిగింది.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగు వద్ద ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, వాగు వద్ద కలవర్ట్ దాటే సమయంలో వర్షపు నీటి ఉధృతికి కారుతో సహా డ్రైవర్ జంపన్నవాగులో గల్లంతయ్యారు. హైదరాబాద్ ఘట్ కేసర్ కు చెందిన తిమ్మయ్య అనే వ్యక్తి గల్లంతైనట్లు సమాచారం.
జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ, బ్రిడ్జిపై ప్రవహిస్తున్న వర్షపు నీళ్లపై వాహనాలు నడపకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ, అధికారుల సమాచారాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జంపన్న వాగు దాటే ప్రయత్నంలో తిమ్మయ్య నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.
స్థానిక ప్రజలు పోలీసు స్టేషన్కు సమాచారం అందించడంతో, ఘటన స్థలానికి చేరుకున్న సంబంధిత అధికారులు, రెస్క్యూ టీం మరియు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.










