ములుగు, 2026-07-27
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పెడు వీరాపురం గ్రామపంచాయతీ పరిధిలోని టేకులబోర్ గ్రామానికి చెందిన గిరిజన రైతు పొడెం రాజబాబు (54) పాలెం ప్రాజెక్టు కాలువలో పడి మృతి చెందాడు. ఆదివారం పొలం పనికి వెళ్లి సోమవారం మృతదేహంగా కాలువలో కనిపించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పెడు వీరాపురం గ్రామపంచాయతీ పరిధిలోని టేకులబోర్ గ్రామానికి చెందిన గిరిజన రైతు పొడెం రాజబాబు (54) పాలెం ప్రాజెక్టు కాలువ దాటే సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడి మృతి చెందాడు. ఆదివారం మధ్యాహ్నం పొలం పని నిమిత్తం వెళ్ళిన రైతు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. కోయబస్తగూడెం గ్రామంలోని తన పొలంను చూసుకునేందుకు వెళ్ళిన రాజబాబు, సోమవారం మధ్యాహ్నం పాలెం ప్రాజెక్టు కాలువ నీటిలో మృతదేహంగా వెలుగులోకి వచ్చాడు.
వ్యవసాయంతో పాటు ఇంటి వద్ద ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజబాబు, ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందడంతో కుటుంబీకులు, బంధుమిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాలువ వద్ద ఉన్న ఇతర రైతులు మృతదేహాన్ని గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.










