ములుగు, జూలై 16
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పోడు భూముల సమస్యలపై ఆదివాసి సంక్షేమ పరిషత్ అత్యవసర సమావేశం నిర్వహించింది. అర్హులైన ఆదివాసులకు పూర్తిస్థాయిలో హక్కు పత్రాలు ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, గిరిజనేతర్లకు చట్టవిరుద్ధంగా పట్టాలు ఇస్తున్నారని పరిషత్ నాయకులు ఆరోపించారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఆదివాసుల ఆరాధ్య దైవం గోండు బొబ్బిలి కొమరం భీమ్ విగ్రహం వద్ద ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల కమిటీ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉపాధ్యక్షులు తాటి రాంబాబు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు తుర్స కృష్ణ బాబు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల సమస్య నేటికీ తీరడం లేదని అన్నారు. అర్హులైన ఆదివాసులకు పూర్తిస్థాయిలో హక్కు పత్రాలు ఇప్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఐదు ఎకరాల పోడు భూమి ఉంటే, రెండూన్నర ఎకరాలకే హక్కు పత్రాలు ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. మిగతా భూమి విషయంలో అటవీశాఖ అధికారులు మొక్కలు వేస్తామని, సాగు చేసుకున్న భూమిని ఆదివాసుల నుండి అన్యాయంగా లాక్కుంటున్నారని ఆయన ఆరోపించారు.
ఆదివాసులు ఎన్నో ఏళ్లుగా పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని దశాబ్దాలుగా పోరాడుతున్నా, పాలక ప్రభుత్వాలు ఈ విషయంలో విఫలమయ్యాయని తుర్స కృష్ణ బాబు అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతర్లకు కూడా పోడు భూముల పట్టాలు ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, లేనియెడల ఉవ్వెత్తున ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సోడి గోపి, తుర్స ప్రశాంత్, నల్లబోయిన సూరత్, తుర్స శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.







