ములుగు, 2026-07-28
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఆదివాసి హక్కుల పోరాట సమితి 'తుడుం దెబ్బ' ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్త ఐటిడిఏల ముట్టడికి పిలుపునిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని హనుమాన్ ఫంక్షన్ హాల్ వద్ద ఆదివాసి హక్కుల పోరాట సమితి 'తుడుం దెబ్బ' ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సమీక్ష సమావేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లెం కోటి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్త ఐటిడిఏ ల ముట్టడికి జాతీయ, రాష్ట్ర కమిటీలు ప్రణాళిక సిద్ధం చేశాయని ఆయన తెలిపారు.
ఆగస్టు 24న ఏటూరు నాగారం, ఆగస్టు 31న ఉట్నూర్, సెప్టెంబర్ 7న భద్రాచలం, సెప్టెంబర్ 14న మన్న నూరు ఐటిడిఏలను ముట్టడించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని ఐదో షెడ్యూల్ గిరిజన ఆదివాసులు, యువత సిద్ధం కావాలని 'తుడుం దెబ్బ' రాష్ట్ర అధ్యక్షులు మహిపతి పిలుపునిచ్చారు.
సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ జీవో 57 ద్వారా షెడ్యూల్ ప్రాంతంలో పరిపాలన జరగాలని, ఆదివాసీల పోడు సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ శాఖ దాడులు నిలిపివేయాలని, 1/70 పీసా చట్టం, 1960 వడ్డీ వ్యాపారాల చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐటిడిఏల ముట్టడి కార్యక్రమం జరుగుతుందని సమావేశం తీర్మానించింది.
ఈ సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షులు పోడెం బాబు, కార్యదర్శి కోడెం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి పోదేం రామ్మూర్తి, కోశాధికారి కల్తీ రాంప్రసాద్, ASU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం సతీష్, ఆదివాసి మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వటం సుభద్ర తదితరులు పాల్గొన్నారు.











