షెడ్యూల్డ్ ఏరియాలో పెసా గ్రామసభ అత్యున్నతమైనదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదో షెడ్యూల్ ప్రాంతంలో రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించడంలో వివక్షత చూపుతున్నాయని ఆదివాసీ నవనిర్మాణ సేన ములుగు జిల్లా కన్వీనర్ కుంజ మహేష్ పేర్కొన్నారు. కొండాపురం గ్రామంలో మంగళవారం పెసా గ్రామసభ నిర్వహించినట్లు తెలిపారు. ఈ గ్రామసభ తీర్మానాన్ని బుధవారం ములుగు జిల్లా కలెక్టర్ హన్మంత్ కు మెమోరణ అందజేశారు.
ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన అంగన్వాడీ ఉద్యోగుల భర్తీ ప్రక్రియ నోటిఫికేషన్ షెడ్యూల్ చట్టాలను ఉల్లంఘించే విధంగా ఉందని, ఆదివాసీల హక్కులను కాలరాస్తోందని భావించిన ఆదివాసీలు పెసా గ్రామసభ నిర్వహించుకొని, "మావ నాటే మావ రాజ్యం" నినాదాన్ని నిజం చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారని మహేష్ అన్నారు. గతంలో చదువుకున్న ఆదివాసీ మహిళలు లేకపోయినా, ఎస్సీ గిరిజనేతర మహిళకు అంగన్వాడీ టీచర్ ఉద్యోగం కేటాయించారని, ఇప్పుడు కూడా అదే విధంగా ఆ ఉద్యోగాన్ని ఎస్సీ గిరిజనేతర మహిళకు కట్టబెట్టడాన్ని ఆదివాసీలు పెసా గ్రామసభ ద్వారా చట్టబద్ధంగా వ్యతిరేకించారని తెలిపారు.
ఎస్సీ, బీసీ, ఓసీ ఎవరైనా, ప్రభుత్వం కూడా షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనేతరులేనని రాజ్యాంగం చెబుతోందని, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని ఆయన వివరించారు. ఆదివాసీలకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, అయితే రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్డ్ ఏరియాలో షెడ్యూల్డ్ ట్రైబల్స్ కు దక్కాల్సిన రాజ్యాంగ ఫలాలను దక్కకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగ వ్యతిరేకంగా షెడ్యూల్డ్ ప్రాంతాలకు వలస వచ్చి భూములను, ఉద్యోగాలను కాజేస్తూ, తమ జీవితాలను కూడా నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఆదివాసీలకు దక్కాల్సిన ఫలాలు దక్కకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొండాపురం ఆదివాసీలు తమ స్వయం నిర్ణయాధికారాన్ని పెసా గ్రామసభ ద్వారా రాజ్యాంగబద్ధంగా ప్రకటించుకున్నారని తెలిపారు.
పెసా గ్రామసభ తీర్మానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి తీరాలని, లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాజేడు మండల అధ్యక్షులు మొడెం నాగరాజు, కొండాపురం గ్రామ ఆదివాసీలు పాల్గొన్నారు.










