భారతదేశంలో జరుగుతున్న సహజ వనరుల దోపిడీని తక్షణమే నిలిపివేయాలని యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న భూకబ్జాలు, అటవీ విధ్వంసం, ఖనిజాల దోపిడీ వంటివి భవిష్యత్ తరాలకు ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్న భూకబ్జాలు, అటవీ సంపద విధ్వంసం, ఖనిజాల దోపిడీ వంటివి దేశ భవిష్యత్తుకు తీవ్ర ముప్పు కలిగిస్తున్నాయని అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కులాలు, మతాల పేరిట విద్వేషాలు పెరిగిపోతున్నాయని, అందరినీ కలుపుకొనిపోయే సమర్థవంతమైన పరిపాలన లోపించిందని ఆయన విమర్శించారు.
ప్రపంచంలోని అనేక చిన్న దేశాలు ఆర్థికంగా ముందుకెళ్తున్నాయని, కానీ భారతదేశం వెనుకబడిపోవడానికి రాజకీయ వ్యవస్థే ప్రధాన కారణమని వేణుగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విదేశాల్లో భారతీయ పౌరులు తమ శ్రమతో ఆయా దేశాలను అభివృద్ధి చేస్తున్నా, అలాంటి ప్రోత్సాహం స్వదేశంలో లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో లభించే వనరులను ఇలాగే దుర్వినియోగం చేస్తే భవిష్యత్ తరాలకు ఏమీ మిగలదని హెచ్చరించారు.
ప్రజలందరూ కుల, మత భేదాలు మరచి భారతీయులుగా జీవించాలని, దేశాభివృద్ధికి పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగాల్లో కూడా ప్రతిభ కనబరచాలని, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలని సూచించారు. అప్పుడే దేశం నిజమైన అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు.
ప్రభుత్వ విద్యా, వైద్య రంగాలు నేడు అస్తవ్యస్తంగా మారాయని, ఇది దేశానికి ప్రమాదకరమని వేణుగోపాల్ రెడ్డి అన్నారు. మెరుగైన విద్యా, వైద్య వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ ఉచిత విద్య, వైద్యం అందాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పోరాడాలని, దేశ అభివృద్ధి కోసం కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2027 నాటికి దోపితి, అవినీతి లేని భారతదేశాన్ని నిర్మించాలని ఆకాంక్షించారు.












