Charla, 2026-06-05
సమాజంలో చైతన్యం నింపేలా, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా స్థానిక శ్రీ సరస్వతి విద్యా నికేతన్ పాఠశాల విద్యార్థులు రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని పలు వినూత్న కార్యక్రమాలను చేపట్టారు. ప్లాస్టిక్ రాఖీలకు బదులుగా విత్తనాలతో రాఖీలు తయారు చేసి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
సమాజంలో చైతన్యం నింపేలా, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా స్థానిక శ్రీ సరస్వతి విద్యా నికేతన్ పాఠశాల విద్యార్థులు రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని పలు వినూత్న కార్యక్రమాలను చేపట్టారు. పండుగ సంబరాలలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు సీడ్ రాఖీ (విత్తన రాఖీ) మేకింగ్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఎప్పటిలాంటి ప్లాస్టిక్ రాఖీలకు బదులుగా, విత్తనాలతో పిల్లలు తమ స్వహస్తాలతో రాఖీలను తయారు చేసి పర్యావరణ స్పృహను చాటుకున్నారు. రాఖీ కట్టిన తర్వాత కానుకగా ఇవ్వడానికి గ్రాటిట్యూడ్ కార్డ్ మరియు రెస్పెక్ట్ కార్డ్ లను ఎలా తయారు చేయాలో కూడా ఈ వర్క్‌షాప్‌లో వివరించారు.
సామాజిక చైతన్య ర్యాలీ
మరియు అదే విధంగా, సమాజంలో కేవలం ఆడపిల్లలకే కాకుండా, అబ్బాయిల పెంపకంలో కూడా మార్పు రావాలనే ఉద్దేశ్యంతో, మగపిల్లల పెంపకంలో మార్పు తెద్దాం - సమాజంలో భద్రతను పెంచుదాం, ఆడపిల్లలతో పాటు అబ్బాయిల నడవడికపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి అనే దేశభక్తి నినాదాలతో విద్యార్థులు ఊరి వీధుల్లో సామాజిక చైతన్య ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు బాలల రక్షణపై గుడ్ టచ్ - బ్యాడ్ టచ్ మరియు ఆత్మరక్షణపై ప్రత్యేక అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు.
పోలీసులకు కృతజ్ఞతలు
అనంతరం విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, రాత్రింబవళ్లు సమాజ రక్షణే ధ్యేయంగా శ్రమిస్తున్న పోలీసులకు రాఖీలు కట్టి కృతజ్ఞతలు తెలియజేసారు. గౌరవ రక్షా పత్రాన్ని పోలీసు అధికారులకు బహుకరించారు. ఎటువంటి రాజకీయ సిఫార్సులు, ఒత్తిళ్లకు లోబడకుండా సమాజంలో ఆడపిల్లలకు న్యాయం చేయాలని, పోలీసులపై మాకు పూర్తి నమ్మకం ఉందని విద్యార్థులు ఆ లేఖ ద్వారా పోలీసులకు విన్నవించుకున్నారు.
ఈ కార్యక్రమాల అనంతరం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులందరి మధ్య రాఖీ పండుగ వేడుకలు మిఠాయిల పంపిణీతో ఘనంగా జరిగాయి.
పాఠశాల సంకల్పం
పిల్లలను కేవలం మార్కుల కోసమే కాకుండా, సమాజ బాధ్యత గల ఉత్తమ పౌరులుగా, దేశభక్తులుగా తీర్చిదిద్దడమే తమ ఎస్ఎస్ఎన్ () సంకల్పం ముఖ్య ఉద్దేశ్యమని పాఠశాల డైరక్టర్ లిఖిత పేర్కొన్నారు. దీనికి వారి ఉపాధ్యాయులు రాజేశ్వరి, అరుణ, శ్రావణి, పూజ, ప్రమీల, శ్రీదేవి, శైలజ, రమేష్ ఎంతగానో కృషి చేస్తున్నారని, విద్యార్థినులు స్వహస్తాలతో విత్తనాలతో రాఖీలను ఎంతో చక్కగా తయారు చేశారని, రాఖీ కట్టించుకున్న విద్యార్థులు తోటి సోదరీలకు కృతజ్ఞత పత్రం, గౌరవ పత్రం సమర్పించి, ప్రతి ఆడపిల్లను గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేశారని ఆమె హర్షం వ్యక్తం చేశారు.








