ములుగు, 2 September
మంగపేట మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన 14 ల్యాప్‌టాప్‌లతో కూడిన కంప్యూటర్ ప్రయోగశాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. విద్యార్థినులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆమె సూచించారు.
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థినులు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని, ఉన్నత లక్ష్యాలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన 14 ల్యాప్‌టాప్‌లతో కూడిన కంప్యూటర్ ప్రయోగశాలను మంత్రి అనసూయ సీతక్క ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతోపాటు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని సూచించారు. ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు కంప్యూటర్లు, ఇతర సాంకేతిక పరికరాలను వినియోగించడంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఇప్పటి నుంచే వాటి వినియోగంపై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యార్థినులు కంప్యూటర్ విద్యను అభ్యసించేందుకు 14 ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చామని, ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదివిన విద్యార్థినులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కన్నాయిగూడెం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పదో తరగతి వరకు చదివి, అనంతరం జవహర్‌నగర్‌లో ఇంటర్ విద్యను అభ్యసించిన విద్యార్థిని రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించిందని గుర్తుచేశారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పట్టుదలతో చదవాలని, పదో తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించాలని సూచించారు. తల్లిదండ్రులకు, విద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
విద్యాలయంలో భోజన నాణ్యత, మరుగుదొడ్ల నిర్వహణ, నీటి సరఫరా, ఇతర సౌకర్యాల గురించి మంత్రి విద్యార్థినులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే సంకోచించకుండా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
విద్యార్థినులు తమ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, పగలు లేదా రాత్రి వేళల్లో ఉపాధ్యాయులకు తెలియజేయకుండా ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు.
చదువుతోపాటు శారీరక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. సమష్టిగా శ్రమదాన కార్యక్రమాల్లో పాల్గొని విద్యాలయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న స్థలంలో కూరగాయల పెంపకంపై అవగాహన పెంచుకోవడంతోపాటు జామ, మామిడి వంటి పండ్ల మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. భవిష్యత్తులో తాము చదివిన విద్యాలయానికి తిరిగి వచ్చినప్పుడు, తాము నాటిన మొక్కలు వృక్షాలుగా ఎదగడం చూసి ఆనందించేలా వాటిని సంరక్షించాలన్నారు. విద్యార్థినులందరూ బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

