అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా గురుదేవ్ విద్యాలయంలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించేందుకు ఒక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. కేశవ పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
ఎస్.ఐ. కేశవ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది ప్రమాదాల నుండి రక్షించగలదని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కారు ప్రయాణంలో సీటు బెల్ట్ తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.
మనిషి జీవితాన్ని నాశనం చేసే మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, ప్రలోభాలకు లొంగి వాటికి బానిసలు కావద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే హెల్ప్‌లైన్ నంబర్ల ప్రాముఖ్యతను వివరించారు. పోలీసు సహాయం కోసం 100, సమగ్ర అత్యవసర సేవల కోసం 112, పిల్లల రక్షణ కోసం 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు హెచ్. జి. వి. ప్రసాద్, అకడమిక్ కోఆర్డినేటర్స్ ఎం.వి. సుబ్రహ్మణ్యం, జి. శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమానికి సహకరించిన ఎస్సై కేశవకు ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.












