తెలంగాణ రాష్ట్రంలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జూన్ 25 నుండి ప్రారంభం కానుంది. నకిలీ ఓట్లను తొలగించి, అర్హులకు అవకాశం కల్పించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యం.
రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఓటరు జాబితాలో ప్రత్యేక సవరణలు చేపట్టనున్నారు. ఈ SIR ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, కచ్చితంగా మార్చేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు తొలగించేలా ఈ సవరణలు జరుగుతాయి.
ఈ ప్రక్రియలో భాగంగా, బూత్ లెవెల్ అధికారులు (BLOs) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారు. ఓటర్లు తమ పేరు, ఫోటో, ఎపిక్ నంబర్ వంటి వివరాలను సరిచూసుకోవాలి. ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవడానికి, కొత్తగా అర్హత పొందినవారు పేరు చేర్చుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది.
ఓటర్లు తమ వివరాలను ధృవీకరించుకుని, అవసరమైన సవరణలు లేదా అప్డేట్లను పూర్తి చేసి, జూలై 24 లోగా BLOలకు అందజేయాలి. ఈ గడువులోగా స్పందించని వారి పేర్లు ముసాయిదా ఓటరు జాబితా నుంచి తొలగించబడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాబట్టి, ఓటర్లు ఈ ప్రక్రియను సీరియస్గా తీసుకోవాలని సూచించారు.
భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రావులపల్లి రాంప్రసాద్, ఈ ఓటరు జాబితా సవరణకు ప్రజలందరూ సహకరించాలని, నకిలీ ఓటర్లను గుర్తించి తొలగించడంలో అధికారులకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రక్రియ సాగుతుందని ఆయన పేర్కొన్నారు.












