భద్రాద్రి కొత్తగూడెం, 2026-09-03
భద్రాచలం నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు దొర తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం సంబురాలకే ప్రాధాన్యతనిస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన విమర్శించారు. వాజేడుభద్రాచలం రహదారి గుంతలమయంగా మారి, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని తెలిపారు.
సంబురాలు కాదు.. భద్రాచలం నియోజకవర్గంలో రోడ్లు బాగు చేయండి వాజేడు–భద్రాచలం రహదారి గుంతలమయం.. ఇసుక లారీలతో ప్రజల ప్రాణాలకు ముప్పు అధికారులు, ప్రజాప్రతినిధులు నిద్రపోతున్నారా? – ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు దొర : భద్రాచలం నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించకుండా కేవలం సంబురాలు, ఆర్భాట కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు దొర అన్నారు. వాజేడు నుంచి భద్రాచలం వరకు ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారి, ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా భారీ ఇసుక లారీల నిరంతర రాకపోకలతో రహదారి మరింత దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది గ్రామాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే రోగులు ప్రతిరోజూ ఈ రహదారిపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. రహదారి గుంతల కారణంగా వాహన ప్రమాదాల ప్రమాదం పెరుగుతోందని, అంబులెన్సులు సైతం వేగంగా ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇసుక రవాణా ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నప్పటికీ, అదే ఇసుక లారీల కారణంగా దెబ్బతింటున్న రోడ్ల మరమ్మతులపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. భద్రాచలం నియోజకవర్గంలోని రహదారుల దుస్థితిపై అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్లు: - వాజేడు–భద్రాచలం ప్రధాన రహదారిని తక్షణమే మరమ్మతులు చేసి, పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలి. - గుంతలను వెంటనే పూడ్చి ప్రమాదాలను నివారించాలి. - భారీ ఇసుక లారీల రాకపోకలపై నిబంధనల ప్రకారం కఠిన నియంత్రణ విధించాలి. - లారీల ఓవర్లోడింగ్, అధిక వేగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి. - ఇసుక రవాణా వల్ల రహదారులకు జరుగుతున్న నష్టంపై సంబంధిత శాఖలు సమగ్రంగా పరిశీలించి బాధ్యత వహించాలి. - రోడ్డు భద్రత కోసం అవసరమైన చోట్ల హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలి. “ప్రజల ప్రాణాల కంటే సంబురాలు ముఖ్యం కాదు. ముందుగా రోడ్లు బాగు చేయండి.. ప్రజల ప్రాణాలను కాపాడండి” అని ఇరప. రాజు దొర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిద్రపోతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు మేల్కొని తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజలతో కలిసి రహదారి సమస్యపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.








