ములుగు, 2026-07-28
ములుగు జిల్లా వెంకటాపురం మండలం రాచపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కర్రవాణిగుప్ప గ్రామంలో అంగన్వాడీ కేంద్రం టీచర్ గత వారం రోజులుగా విధులకు హాజరు కాకపోవడంతో పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు అందాల్సిన పోషకాహారం అందడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం రాచపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కర్రవాణిగుప్ప గ్రామంలో అంగన్వాడీ కేంద్రం టీచర్ గత వారం రోజులుగా విధులకు హాజరు కావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ల రాకపోకలతో సేవలు నిలిచిపోయాయని, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉండాల్సిన స్కూలు వారం రోజులుగా మూసే ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు ఆరు రకాల ముఖ్యమైన సేవలు, పథకాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తోంది. అయితే, టీచర్ అందుబాటులో లేకపోవడంతో పిల్లలకు, బాలింతలకు సరైన పోషకాహారం, అల్పాహారం, గుడ్లు అందడం లేదని గర్భిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి ఇదే తీరుగా ఉందని, ఒకరోజు వచ్చి మిగతా రోజులు రాకపోవడం, వారం రోజులు సెలవు పెట్టడం టీచర్లకు అలవాటుగా మారిందని గ్రామస్తులు పేర్కొన్నారు. పిల్లల బరువు, ఎత్తు కొలతలు క్రమం తప్పకుండా నమోదు చేయడంతో పాటు గర్భిణీల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించాల్సిన బాధ్యత టీచర్లపై ఉంది. సమయపాలన లేకుండా ఇష్టానుసారం వచ్చిపోవడం టీచర్లకు పరిపాటిగా మారిందని, ఈ నిర్లక్ష్యంపై సంబంధిత అధికారులు తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.









