భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అర్హులైన కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు వెంటనే మంజూరు చేయాలని, పెన్షన్, బీమా పరిహారం పెంచాలని వారు డిమాండ్ చేశారు.
సీఐటీయూ మండల కన్వీనర్ నిమ్మల మధు మాట్లాడుతూ, సంక్షేమ బోర్డు పథకాలు భవన నిర్మాణ కార్మికులకే పరిమితం కావాలని, అనర్హులైన బయటి వ్యక్తులకు బీమా కార్డులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే వారి కార్డులను రద్దు చేసి, అర్హులైన కార్మికులకే కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్మికులకు ఉపయోగం లేని సీఎస్సీ హెల్త్ టెస్టులను రద్దు చేయాలని, సహజ మరణానికి పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచాలని ఆయన కోరారు. 55 ఏళ్లు పైబడిన కార్మికులకు నెలకు రూ. 6,000 పెన్షన్ ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న క్లెయిములకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇళ్లు లేని భవన నిర్మాణ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలని, మండల కేంద్రంలో కార్మికులు విశ్రాంతి తీసుకోవడానికి ప్రభుత్వ భవనం నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.












