తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇటీవల జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ – ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జర్నలిస్టులు, ఆయన వ్యక్తిగత కార్యక్రమాలను బహిష్కరించాలని నిర్ణయించారు.
ప్రభుత్వ రెండేళ్ల పాలన సమీక్షా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్, జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని సమావేశంలో పాల్గొన్న సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రజలకు సమాచారాన్ని చేరవేసే మీడియా ప్రతినిధులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని వారు పేర్కొన్నారు.
వార్తల ప్రచురణపై అభ్యంతరాలుంటే సంబంధిత మీడియా సంస్థలతో చర్చల ద్వారా లేదా చట్టబద్ధమైన మార్గాల్లో పరిష్కరించుకోవచ్చని, కానీ జర్నలిస్టులందరినీ లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని జర్నలిస్టులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెంటనే బేషరతుగా వెనక్కి తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే వరకు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు మినహా, ఆయన వ్యక్తిగత ప్రెస్మీట్లు, పార్టీ కార్యక్రమాలకు హాజరుకాకూడదని జర్నలిస్టులు నిర్ణయించారు. జర్నలిస్టుల గౌరవ పరిరక్షణకు ఐక్యంగా పోరాటం చేస్తామని, అవసరమైతే భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. మీడియా స్వేచ్ఛను కాపాడటం అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.











