అమలాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, విశాలాంధ్ర స్టాఫ్ రిపోర్టర్ కొండేపూడి సత్యనారాయణ (ఆంధ్రభూమి సత్యనారాయణ) అనారోగ్యంతో ఈరోజు ఉదయం ముమ్మిడివరంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సుమారు 40 ఏళ్ల పాటు పత్రికా రంగంలో సేవలందించిన ఆయన మృతి జర్నలిస్టు లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
కొండేపూడి సత్యనారాయణ, అమలాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, విశాలాంధ్ర స్టాఫ్ రిపోర్టర్ గా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన తన వృత్తి పట్ల అంకితభావంతో, అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ నిన్నటి వరకు కూడా చురుగ్గా విధులు నిర్వర్తించారు. ఒక జర్నలిస్టు సమావేశం గురించి ఆయన నిన్ననే ప్రెస్ గ్రూపులో సందేశం పంపినట్లు సమాచారం.
గతంలో గుండెపోటుతో బాధపడి కోలుకున్నప్పటికీ, షుగర్ వ్యాధి ఆయన ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేసింది. ఇటీవల మరోసారి స్ట్రోక్ రావడంతో, పరిస్థితి విషమించింది. వారం రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన, వైద్యుల చికిత్స పొందుతూనే ఇంటికి చేరుకున్నారు. అయితే, చికిత్స అనంతరం ఆయన తుదిశ్వాస విడిచారు.
ఆసుపత్రిలో చేరినప్పుడు, ఆయన పల్స్ రేట్ 30కి పడిపోయిందని, పరిస్థితి క్లిష్టంగా ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. కొండేపూడి సత్యనారాయణకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన జర్నలిస్ట్ యూనియన్లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యునిగా ఉన్నారు.










