ఎటూరునాగారం, 2026-08-14
ఆదివాసీ హక్కులు, భూమి, ఉద్యోగాలు, చట్టపరమైన రక్షణ కోసం ఆగస్టు 17, సోమవారం ఏటూరునాగారంలో నిర్వహించనున్న చలో ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఆదివాసీ హక్కులు, భూమి, ఉద్యోగాలు, చట్టపరమైన రక్షణ కోసం ఆగస్టు 17, సోమవారం ఏటూరునాగారంలో నిర్వహించనున్న చలో ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏటూరునాగారం మండలంలో తుడుం దెబ్బ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ఉద్యోగస్తులు, ప్రజలు, ఆదివాసీ గూడేల ప్రజలను కలిసి ముట్టడి కార్యక్రమానికి మద్దతు కోరుతున్నారు. నాయకుల పిలుపుకు ఉద్యోగస్తులు సానుకూలంగా స్పందిస్తూ ఆదివాసీ సమస్యల పరిష్కారానికి తమ మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. ఆదివాసీల హక్కులను కాపాడుకోవడానికి ఇక పోరాటమే మార్గమని నాయకులు స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో తరతరాలుగా ఆదివాసులు ఎదుర్కొంటున్న భూ, ఉద్యోగ, చట్టపరమైన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
ప్రధాన డిమాండ్లు
తుడుం దెబ్బ నాయకులు తమ ప్రధాన డిమాండ్లను స్పష్టం చేశారు. జీఓ నెంబర్3ను తక్షణమే పునరుద్ధరించాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ఆదివాసీ భూములకు రక్షణ కల్పించాలని కోరారు. ఐటీడీఏలను బలోపేతం చేసి ఏజెన్సీ ప్రాంత ఆదివాసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఆదివాసులు సాగు చేసుకుంటున్న ఎనిమిది లక్షల ఎకరాల భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన అర్హత కలిగిన ఆదివాసులకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో అమలులో ఉన్న సాదా బైనామా జీఓ నెంబర్76ను రద్దు చేయాలని కోరారు. ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీల హక్కులు, భూమి, ఉద్యోగాలు, అభివృద్ధి సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.
పోరాటమే మార్గం
ఇది ఒక కార్యక్రమం మాత్రమే కాదు.. ఆదివాసీ హక్కుల కోసం జరిగే పోరాటం అని తుడుం దెబ్బ నాయకులు పేర్కొన్నారు. ప్రతి ఆదివాసీ గూడెం నుంచి కుటుంబాలతో, యువతతో, మహిళలతో పెద్ద ఎత్తున ప్రజలు ఏటూరునాగారం తరలివచ్చి ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ హక్కుల కోసం ఒక్కటై కదలాలని, ఏజెన్సీ ప్రాంత సమస్యలపై ప్రభుత్వానికి తమ ఐక్యతను చాటాలని నాయకులు కోరారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి వట్టం జనార్దన్, ఏటూరునాగారం మండల అధ్యక్షులు తాటి నీలాద్రి, ఉపాధ్యక్షులు కోరం సుధాకర్, కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ఆలం రాంబాబు, ప్రధాన కార్యదర్శి సిడం రవి, పనికుమార్, పిట్టల నాగేష్ తదితరులు పాల్గొన్నారు.












