కలెక్టరేట్ (సహస్ర) జూన్ 30
ప్రభుత్వ రంగంలో సుమారు 39 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందుతున్న నలుగురు జిల్లా స్థాయి అధికారులు, తహసిల్దార్లను మంగళవారం కలెక్టరేట్ వేదికగా జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారి సేవలను కలెక్టర్ కొనియాడారు.
ప్రభుత్వ రంగంలో సుమారు 39 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన, విశిష్టమైన సేవలు అందించి పదవీ విరమణ పొందుతున్న నలుగురు జిల్లా స్థాయి అధికారులు, తహసిల్దార్లను మంగళవారం కలెక్టరేట్ వేదికగా జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఘనంగా సన్మానించారు. పదవీ విరమణ పొందిన వారిలో కడలి కాశీ విశ్వేశ్వరరావు (కలెక్టరేట్ పరిపాలనా అధికారి), టి. శ్రీనివాస్ (తహసిల్దార్, మల్కిపురం), ఎస్.ఎన్.వి.ఎస్. భాస్కరరావు (తహసిల్దార్, ఉప్పలగుప్తం), ఏ. రాధాకృష్ణారావు (జిల్లా సహకార అధికారి) ఉన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ మాట్లాడుతూ, పదవీ విరమణ పొందుతున్న అధికారులు తమ సుదీర్ఘ సర్వీసులో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలోనూ, పరిపాలనను సజావుగా సాగించడంలోనూ అందించిన సేవలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. వారు అందించిన ప్రభుత్వ సర్వీసు వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, విధి నిర్వహణలో వారు చూపిన ప్రతిభను, నిబద్ధతను ప్రత్యేకంగా అభినందించారు. ఉద్యోగ బాధ్యతల నుండి విరమణ పొందుతున్న వీరంతా తమ విశ్రాంత జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని ఆయన ఆకాంక్షించారు.
అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి ప్రసంగిస్తూ, వివిధ హోదాల్లో సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వ సేవలో కొనసాగి, నేడు పదవీ విరమణ పొందుతున్న అధికారుల సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. వారి భవిష్యత్తు జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు మాట్లాడుతూ, రెవెన్యూ శాఖలో 39 సంవత్సరాల పాటు ముగ్గురు రెవెన్యూ అధికారులు త్రిమూర్తులు మాదిరిగా విశేషమైన సేవలు ఎక్కువ శాతం కోనసీమ జిల్లాలో అందించడం ప్రశంసనీయమన్నారు.
ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన అధికారులను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సన్మాన కార్యక్రమంలో కలెక్టరేట్ ఉన్నతాధికారులు, సిబ్బంది మరియు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని, పదవీ విరమణ చేస్తున్న అధికారులకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు.


