Charla, 2026-08-21
ఒక వ్యక్తి జీవితంలో సంపాదించిన సంపద కంటే, సమాజానికి అందించిన సేవే శాశ్వతంగా నిలిచిపోతుందని, అలాంటి మహనీయుల్లో చర్ల మన్నెసీమ గర్వించదగ్గ వ్యక్తి చింతల చెర్వు వెంకట కృష్ణారావు (సి.వి.కె. రావు) ఒకరని కళాకారులు, సామాజిక సంస్థలు ఆయన ఐదవ వర్ధంతి సందర్భంగా కృతజ్ఞతతో స్మరించుకుంటున్నాయి. నటుడిగా, దర్శకుడిగా, నిర్వాహకుడిగా, సామాజిక సేవకుడిగా, విద్యాభివృద్ధికి దాతగా, ప్రజాహితాన్ని జీవిత లక్ష్యంగా మలుచుకున్న సి.వి.కె. రావు సేవలను చర్ల ప్రజలు స్మరించుకుంటున్నారు.

బాల్యంలోనే కష్టాలను జయించిన వ్యక్తిత్వం
1929 జూన్ 5న నాటి తూర్పు గోదావరి జిల్లా చర్ల సమీపంలోని లింగాపురం గ్రామంలో చింతల చెర్వు వెంకట సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించిన కృష్ణారావు చిన్న వయసులోనే తల్లిని కోల్పోయారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుడు, తామ్రపత్ర గ్రహీత చింతల చెర్వు వెంకటాద్రి దంపతుల వద్ద దత్తపుత్రుడిగా పెరిగి ఉన్నత విద్యను అభ్యసించారు. చర్ల, భద్రాచలం, ఏలూరు, మద్రాసు ప్రాంతాల్లో విద్యనభ్యసించి బి.ఏ., ఎల్.ఎల్.బి. పూర్తి చేశారు. 1959లో బ్లాక్ డెవలప్మెంట్ అధికారిగా ప్రభుత్వ సేవలో చేరి గ్రామీణాభివృద్ధికి విశేష సేవలందించారు. ఉద్యోగం జీవనోపాధి మాత్రమే కాగా, సమాజసేవ ఆయన జీవిత లక్ష్యంగా నిలిచింది.
ప్రజల కోసం రాజకీయాలు
స్వాతంత్ర్య సమరయోధుడు వెంకటాద్రి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీలో చేరిన సి.వి.కె. రావు ఎప్పుడూ పదవుల కోసం ప్రయత్నించలేదు. ప్రజల సమస్యల పరిష్కారాన్నే రాజకీయాల అసలు లక్ష్యంగా భావించి చర్ల ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు.
రంగస్థలంపై వెలిగిన కళా నక్షత్రం
విద్యార్థి దశ నుంచే నాటకాలపై మక్కువ పెంచుకున్న ఆయన నటుడిగా, దర్శకుడిగా, న్యాయనిర్ణేతగా, నిర్వాహకుడిగా విశేష గుర్తింపు పొందారు. గుడ్డిలోకం, వలయం, మృగమైదానం, సుమతి, కృష్ణపక్షం, ఒంటెద్దు బండి వంటి అనేక నాటకాలలో ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు కటక్, లక్నో, అలహాబాద్ వంటి నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చి చర్ల ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.
చర్లకు నాటకరంగ చిరునామా
1997లో శ్రీ దేవభక్తుని నందీశ్వరుడు స్మారక నాటక పరిషత్ ఏర్పాటైన తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి సుమారు 16 నాటక పరిషత్తులను విజయవంతంగా నిర్వహించారు. వందలాది కళాకారులకు అవకాశాలు కల్పించి యువతలో కళాప్రేమను పెంపొందించారు. అందుకే ఆయనను అందరూ ప్రేమగా కళా బంధువు అని పిలిచేవారు.