భద్రాద్రి కొత్తగూడెం, జూలై 25
చర్ల రైతు వేదికలో శనివారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, భద్రాచలం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్న చర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు వర్మ, సబ్ ఇన్స్పెక్టర్ నర్సిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాంబాబులను ఘనంగా సన్మానించారు.
సమాజ సేవే లక్ష్యంగా మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ భద్రాచలం వి. శివ నాయక్ ఆధ్వర్యంలో, భద్రాచలం బార్ అసోసియేషన్ సౌజన్యంతో శనివారం చర్ల రైతు వేదికలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు పతకాలు అందుకున్న చర్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు వర్మ, సబ్ ఇన్స్పెక్టర్ నర్సిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రాంబాబులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ వి. శివ నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చదువే ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. ప్రతి శనివారం గ్రామీణ ప్రాంతాల రైతులు, విద్యార్థులు, ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు అందించేందుకు తాము అందుబాటులో ఉంటామని వెల్లడించారు.
చర్ల సీఐ రాజు వర్మ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు, మాదకద్రవ్యాలకు బానిస కాకుండా లక్ష్యసాధన కోసం విద్యపై దృష్టి పెట్టాలని సూచించారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, పట్టుదలతో చదివితే ఏ కష్టాన్నైనా అధిగమించి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
న్యాయవాది సతీష్ మాట్లాడుతూ సేవాభావంతో పనిచేసే అధికారులు చాలా అరుదుగా ఉంటారని, సమాజ సేవలోనే నిజమైన ఆత్మసంతృప్తి ఉందన్నారు. అలాంటి అధికారులతో కలిసి పనిచేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత తప్పకుండా బిల్లు తీసుకోవాలని, దానివల్ల నష్టం పోయిన రైతులు వినియోగ దారుల ఫోరంలో కేసు వేసుకోవడానికి వీలు ఉంటుందని తెలిపారు. నకిలీ విత్తనాల బారిన పడవద్దని సూచించారు.
సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ బార్ అసోసియేషన్ తరఫున భవిష్యత్తులో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చర్ల సర్పంచ్ పూజారి సామ్రాజ్యం, లింగాపురం సర్పంచ్ గుగులోతు మంగా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండారు రామకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాస రావు, సీనియర్ న్యాయవాదులు రావి రాం మోహన్, పేరాల వెంకటేశ్వర్లు, అవులూరి సత్యనారాయణ, సాదనపల్లి సతీష్, రాజేంద్ర వర్దన్, శివ కృష్ణ, మహిళా న్యాయవాది ధాట్ల సంధ్య, వాసం శారద, సంద్యారాణి, యూత్ నాయకులు బోరా పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












