వాజేడు, 19 November
ములుగు జిల్లాలోని మండలం నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ మార్గం అడుగడుగునా గోతులతో, వర్షపు నీటితో నిండిపోయి ప్రయాణికులకు నరకంగా మారింది. అత్యవసర సమయాల్లో రోగులను తరలించడం కూడా కష్టంగా మారింది.
అభివృద్ధి అంటే ఆకాశహర్మ్యాలు నిర్మించడం మాత్రమే కాదు, మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే కట్టకడపటి పౌరుడికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడమే నిజమైన ప్రగతి. కానీ, ములుగు జిల్లాలోని మండలం నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిని చూస్తే, ఈ ప్రాంతం ఇంకా రాతియుగంలోనే ఉందా అనే సందేహం కలుగక మానదు. నిత్యం వేలాది మంది ఆదివాసీలు, విద్యార్థులు, రైతులు, రోగులు ప్రయాణించే ఈ ప్రధాన రహదారి నేడు అక్షరాలా మృత్యుమార్గంగా, ప్రయాణికులకు పాలిట నరకంగా మారింది. అడుగడుగునా భారీ గోతులు, వర్షాకాలంలో చెరువులను తలపించే నీటి కుంటలు, ఎండాకాలంలో కళ్లు కనబడకుండా కమ్మేసే దుమ్ముధూళితో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నరకానికి మోక్షం ఎప్పుడు అంటూ , వెంకటాపురం మండలాల ప్రజలు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. మండలంలోని అనేక మారుమూల గిరిజన గ్రామాలకు, ఆదివాసీ గూడేలకు వెంకటాపురం ప్రధాన వాణిజ్య కేంద్రం. నిత్యావసర సరుకులు మొదలుకొని వ్యవసాయ ఎరువులు, విత్తనాలు, ఆసుపత్రి అవసరాల వరకు ఆదివాసీలు వెంకటాపురంలోని దుకాణ సముదాయాలపైనే ఆధారపడతారు. అలాగే, మెరుగైన వైద్యం కోసం, ఉన్నత చదువుల కోసం భద్రాచలం వెళ్లాలన్నా ఇదే ఏకైక ప్రధాన రహదారి.
కానీ, ప్రస్తుతం ఈ రోడ్డుపై అడుగుపెట్టాలంటేనే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయపడుతున్నారు. ఒకప్పుడు గంటలో పూర్తయ్యే ప్రయాణానికి ఇప్పుడు రెండు, మూడు గంటలు పడుతోంది. ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడి కాళ్లు, చేతులు విరగొట్టుకుంటున్నారు. ఆటోలు, ప్రైవేట్ వాహనాలు నిత్యం మరమ్మతులకు గురవుతుండటంతో డ్రైవర్లు ఈ రూట్లో రావడానికి నిరాకరిస్తున్నారు. వచ్చినా అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో సామాన్య ఆదివాసీలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. ముఖ్యంగా విషజ్వరాలు, పాముకాట్లు, పురిటి నొప్పులతో బాధపడే గర్భిణీ స్త్రీలను 108 అంబులెన్స్‌లో భద్రాచలం తరలించాలంటే ఆ ప్రయాణం ప్రాణాంతకంగా మారుతోంది. గుంతల కుదుపులకు మార్గమధ్యలోనే రోగుల పరిస్థితి విషమించి, ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలు ఈ ప్రాంత ప్రజల గుండెలను పిండేస్తున్నాయి. ఈ ప్రాంత ప్రజల కష్టాలు పాలకులకు తెలియనివి కావు. స్థానిక భద్రాచలం ఎమ్మెల్యే నిత్యం ఇదే దారి గుండా రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రులు, ఉన్నతాధికారులు పర్యటనలకు వచ్చినప్పుడు ఇదే రోడ్డుపై ప్రయాణిస్తారు. ఖరీదైన కార్లలో ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఆ కుదుపులు, గుంతల తీవ్రత అనుభవంలోకి వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ, ఈ రహదారిని నాణ్యతా ప్రమాణాలతో శాశ్వతంగా నిర్మించాలనే చిత్తశుద్ధి మాత్రం ఎవరిలోనూ కనిపించడం లేదు. ఎన్నికల వేళ హామీల వర్షం కురిపించే నాయకులు, గెలిచాక రహదారి సౌకర్యాన్ని పట్టించుకోవడం లేదని ఆదివాసీలు మండిపడుతున్నారు. అప్పుడప్పుడు తూతూమంత్రంగా గుంతల్లో మట్టి, కంకర వేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, బలమైన తారు రోడ్డు నిర్మించడంలో విఫలమవుతున్నారు.
ఈ వ్యవహారంలో అధికార యంత్రాంగం, పోలీసు శాఖల ప్రాధాన్యతలపై ప్రజల నుంచి తీవ్రమైన ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా కారణాల రీత్యా, మావోయిస్టుల కదలికలను నియంత్రించేందుకు దట్టమైన అటవీ ప్రాంతమైన కర్రెగుట్టల వంటి దుర్గమ ప్రాంతాలకు సైతం భారీ పోలీసు బందోబస్తు మధ్య యుద్ధప్రాతిపదికన రోడ్లు వేయించేందుకు అధికారులు చొరవ చూపుతున్నారు. అందుకు నిధులు, అనుమతులు, భద్రత అన్నీ రాత్రికి రాత్రే సమకూరుతున్నాయి. దేశ భద్రత కోసం అడవుల్లో రోడ్లు వేయడాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. కానీ, వేలాది మంది సామాన్య ప్రజలు నిత్యం ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణించే ప్రధాన రహదారిపై అధికారులకు ఎందుకు సోయి ఉండటం లేదనేది ఇక్కడి ఆదివాసీల ప్రధాన ప్రశ్న. నిర్మానుష్యమైన కర్రెగుట్టలకు దారి వేయగల సమర్థత ఉన్న యంత్రాంగానికి, వెంకటాపురం భద్రాచలం ప్రధాన రహదారిని బాగు చేయడం అంత కష్టమా ప్రజల ప్రాణాల కంటే ఇతర అంశాలే అధికారులకు ముఖ్యమా అని స్థానిక మేధావులు, గిరిజన సంఘాలు నిలదీస్తున్నాయి. రహదారి దుస్థితి వల్ల విద్యార్థులు సమయానికి కళాశాలలకు వెళ్లలేక చదువులకు దూరమవుతున్నారు. సరుకు రవాణా భారమై నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రజల సహనం నశించి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం రాకముందే పాలకులు, అధికారులు మేల్కోవాలి. అడవి బిడ్డలైన ఆదివాసీలు ఆడంబరాలు కోరుకోవడం లేదు, కేవలం ఆపద వస్తే ఆసుపత్రికి చేరడానికి ఒక సురక్షితమైన మార్గం మాత్రమే కోరుకుంటున్నారు. జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే ఒక్కసారి సామాన్య ప్రయాణికుడిలా ఈ రోడ్డుపై ప్రయాణించి ప్రజల కష్టాలను కళ్లారా చూడాలి. ఆదివాసీల కన్నీళ్లు తుడిచేలా ఈ నరకప్రాయమైన రహదారికి తక్షణమే మోక్షం కలిగించాలని యావత్ ఏజెన్సీ ప్రాంతం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తోంది.



