2014 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు, ప్రత్యేక హామీలు, వాటి అమలు స్థితిగతులపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ డిమాండ్ చేశారు.
బహుజన సేన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హామీలు, ఆర్థిక సహాయం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, జాతీయ ప్రాజెక్టుల కింద మంజూరైన నిధుల వివరాలను ప్రజల ముందుంచాలని కోరారు.
రాష్ట్రానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎంత మేర నిధులు విడుదలయ్యాయి, వాటిలో ఎంత మేర ఖర్చు చేశారు, రాష్ట్ర అభివృద్ధికి ఎంత మేర ఉపయోగపడ్డాయో ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయాలని ఆయన అన్నారు. రాయలసీమ ప్రాంతానికి, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు విభజన చట్టం ప్రకారం, అనంతర కాలంలో కేటాయించిన నిధులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పూర్తి చేసిన పనులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి, వెలిగొండ వంటి సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటి వరకు విడుదల చేసిన నిధులు, పూర్తి చేసిన పనులు, ఇంకా పూర్తి చేయాల్సిన పనులపై కూడా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. కర్నూలు జిల్లా రైతాంగం, యువత, విద్యార్థులు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్పష్టత ఇవ్వాలని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన జరిగి దాదాపు పన్నెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన అనేక హామీలు ఇంకా పూర్తిస్థాయిలో అమలు కాలేదని నాగేంద్ర పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజల సందేహాలకు సమాధానం చెప్పే విధంగా సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కోరారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతి రూపాయి నిధి, కర్నూలు జిల్లాకు జరిగిన ప్రతి కేటాయింపు ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.












