అమలాపురం పట్టణంలో క్రిస్టియన్ మిషనరీకి చెందిన భూములను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి సుమారు రూ. 16 కోట్లు నష్టం వాటిల్లిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలతో అమలాపురం పట్టణ నివాసి ఉండ్రు కృష్ణ ప్రసాద్ జిల్లా కలెక్టర్ శ్రీ వావిరాల మహేష్ కుమార్ కు సోమవారం 'స్పందన' కార్యక్రమంలో లిఖితపూర్వక ఫిర్యాదును సమర్పించారు.
ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం, అమలాపురం 10వ వార్డు గాంధీనగర్లోని క్రిస్టియన్ మిషనరీకి చెందిన 4.35 ఎకరాల భూమిని కొందరు అక్రమార్కులు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 'ఎనీవేర్ రిజిస్ట్రేషన్' విధానం ద్వారా తమ పేరిట మార్చుకున్నారు. ఈ ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలున్నాయి.
ప్రభుత్వానికి రావాల్సిన రాబడికి మూడు రకాలుగా గండి కొట్టారని ఫిర్యాదుదారు ఆరోపించారు. విలువైన పట్టణ భూమిని వ్యవసాయ భూమిగా చూపిస్తూ రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా దాదాపు రూ. 5 కోట్ల స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టారని, భూ వినియోగ మార్పిడి ఫీజులు చెల్లించకుండా రూ. 6 కోట్ల మేర నష్టం చేకూర్చారని, అలాగే నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి అప్పగించాల్సిన కామన్ సైట్ను సైతం అక్రమంగా విక్రయించి మరో రూ. 5 కోట్లు ఆర్జించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ లేఅవుట్ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని మున్సిపల్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయని ఫిర్యాదుదారు తెలిపారు. గత జనవరి 27న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు దీనిని 'అక్రమ లేఅవుట్'గా అధికారిక ఎజెండాలో పొందుపరిచారని, ఆ పత్రాలను కూడా సాక్ష్యంగా కలెక్టర్ గారికి అందజేసినట్లు చెప్పారు. ప్రస్తుతం గాంధీనగర్లో రోడ్డు విస్తరణ పేరుతో జరుగుతున్న పనుల వెనుక అక్రమ లేఅవుట్ మార్కెట్ ధరను పెంచి, లబ్ధిదారులకు లాభం చేకూర్చే కుట్ర ఉందని అనుమానాలను లేవనెత్తారు.
ప్రభుత్వ సొమ్మును, మిషనరీ భూములను హస్తగతం చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విలేకరి మండేలా నాగ వెంకట ప్రసాద్ (బాబీ)తో పాటు అతని వెనుక ఉన్న రాజకీయ సూత్రధారులపై తక్షణమే విజిలెన్స్ విచారణ జరిపించాలని, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కృష్ణ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్, సమర్పించిన ఆధారాలను పరిశీలించి నిబంధనల ప్రకారం తదుపరి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.












