అమలాపురం, జూలై 03
బలహీనపడిన గోదావరి నది ఏటిగట్లను శాశ్వత ప్రాతిపదికన పటిష్టపరచడానికి సిఎస్ఐఆర్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐఓ)తో కలిసి సమగ్ర ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. ఇటీవల కుండలేశ్వరం వద్ద ఏటిగట్టు కుంగిపోయిన ఘటన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.
బలహీనపడిన గోదావరి నది ఏటిగట్లను శాశ్వత ప్రాతిపదికన పటిష్టపరచడానికి సిఎస్ఐఆర్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐఓ) ప్రతినిధులతో కలిసి సమగ్ర ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి సిఎస్ఐఆర్-ఎన్ఐఓ ప్రతినిధులు డాక్టర్ వినీత్, సైంటిస్టులు జయ కుమార్, సేలంలతో కలెక్టర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల కుండలేశ్వరం వద్ద గోదావరి తీరం వెంబడి ఏటిగట్టు కిందకు దిగిపోయిన, కుంగిపోయిన సంఘటనను తీవ్రంగా పరిగణించామన్నారు. ఇటువంటి బలహీనమైన, ప్రమాదకరమైన ప్రాంతాలను రక్షించడానికి శాస్త్రీయ విధానాలు అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నిపుణులు, గోదావరి హెడ్ వర్క్స్ జలవనరుల శాఖ ఇంజనీర్లు కలిసి క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పర్యటించాలని ఆదేశించారు.
గోదావరి తీరప్రాంత పొడవునా ఎక్కడెక్కడ ఏటిగట్లు బలహీనపడ్డాయో క్షుణ్ణంగా గుర్తించి, వాటి పునరుద్ధరణకు ప్రాథమిక నివేదిక, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనల ఆధారంగా డాక్టర్ ఎం.ఎస్. శ్రీవత్స, సంస్థ సీఈఓ కిరణ్ పమిడిపాటి సాంకేతిక అంచనాలను త్వరితగతిన రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
భవిష్యత్తులో నదీ తీర ప్రాంతాల్లో సంభవించే విపత్తుల తీవ్రతను తగ్గించేందుకు, ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నుండి రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ జి. శ్రీనివాసరావు, వారి సహచర ఇంజనీర్లు, జిల్లా డ్రైనేజీ విభాగం కార్యనిర్వాహక ఇంజనీర్ ఎం.వి.వి. కిషోర్, శాస్త్రవేత్తలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












