డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, 2 July
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. పుస్తకాలు, యూనిఫాం, రవాణా వంటి అదనపు ఖర్చుల పేరుతో భారీ మొత్తంలో వసూళ్లు చేస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. నోటీస్ బోర్డుల్లో ఫీజుల వివరాలు ప్రదర్శించాలన్న నిబంధనను కూడా పాటించడం లేదు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యాశాఖ నిబంధనలను తుంగలో తొక్కి ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి. పుస్తకాలు, యూనిఫాం, రవాణా వంటి అదనపు ఖర్చుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్నాయి. అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విచారకరం.
ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులో తప్పనిసరిగా ప్రదర్శించాలన్న నిబంధన ఉన్నా, చాలా పాఠశాలలు దీనిని పాటించడం లేదు. జిల్లాలో ఫీజుల తీరును పరిశీలిస్తే తల్లిదండ్రులకు గుండె జబ్బులు వచ్చేలా ఉన్నాయని వాపోతున్నారు.
పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు తల్లిదండ్రుల కమిటీలు ఏర్పాటు కాలేదు. కొన్ని పాఠశాలల్లో క్రీడా ప్రాంగణం లేకపోవడం, ఉన్నా పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అయినా వాటికి అనుమతులు ఎలా మంజూరు చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.
అమలాపురం పట్టణంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో గత ఏడాది 8వ తరగతికి రూ. 32,000 ఫీజు ఉండగా, ఈ ఏడాది రూ. 52,000కు పెంచారు. వీటికి తోడు పుస్తకాలకు రూ. 10,000, యూనిఫాంకు రూ. 4,000, బూట్లు, టైకు రూ. 1,000 అదనంగా వసూలు చేస్తున్నారు. రవాణా ఛార్జీలు అదనం.
అమలాపురం పట్టణంలోని ఇతర ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ. 23,000 ఫీజుతో పాటు పుస్తకాల పేరుతో మరో రూ. 5,000 వసూలు చేస్తున్నట్లు తెలిసింది. రాజోలులో ఓ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థికి గతంలో రూ. 27,000 వసూలు చేయగా, ప్రస్తుతం రూ. 35,000కు పెంచినట్లు సమాచారం. అల్లవరం మండలంలో ఒకటో తరగతికి రూ. 30,000 ఫీజు వసూలు చేస్తున్నారు.
అమలాపురం పట్టణంలోని కార్పొరేట్ స్కూళ్ల ఫీజులు వింటే తల్లిదండ్రులు షాక్కు గురవుతున్నారు. జూనియర్, సీనియర్ ఇంటర్ ఫీజులను అమలాపురంలోని మూడు ప్రముఖ కళాశాలల యాజమాన్యాలు గణనీయంగా పెంచేశాయి. ఒక కళాశాల యాజమాన్యం ఫీజు తగ్గించే ఉద్దేశంతో ఎవరి సిఫార్సు వచ్చినా కేవలం రూ. 1,000 మాత్రమే తగ్గిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
అర్హత కలిగిన ఉపాధ్యాయుల జాబితాను ప్రదర్శించాలన్న నిబంధన కూడా పాటించడం లేదు. ప్లే స్కూళ్లలో ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా, అలాంటి స్కూళ్లకు ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి అయినప్పటికీ యథావిధిగా కొనసాగుతున్నాయి.












