ములుగు, జూలై 22
షెడ్యూల్ ప్రాంతంలో భూమిపై ఆదివాసీలకే హక్కు ఉందని, జీవో 3ని పునరుద్ధరించి, 5వ షెడ్యూల్ సెక్షన్ 5(2) ప్రకారం ప్రభుత్వం చట్టం చేయాలని ఆదివాసి "లా" అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నాయని వక్తలు ఆరోపించారు.
షెడ్యూల్ ప్రాంతంలో భూమిపై హక్కు ఆదివాసీలకే ఉందని, జీవో 3ని పునరుద్ధరించి, 5వ షెడ్యూల్ సెక్షన్ 5(2) ప్రకారం ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
వెంకటాపురం మండల కేంద్రంలోని రహదారి విశ్రాంతి భవనంలో ఆదివాసి "లా" అసోసియేషన్ ఆధ్వర్యంలో 1/70 చట్టం, 3 జీవోను చట్టం చేయాలనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆదివాసి లా అసోసియేషన్ సభ్యులు సున్నం రమేష్, చింత సమ్మయ్య, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు యాసం రాజు, రాష్ట్ర కార్యదర్శి మడకం చిట్టిబాబు, గొండ్వాన సంక్షేమ పరిషత్ ప్రధాన కార్యదర్శి పూనం సాయి దొర, జిల్లా అధ్యక్షులు పూణెం ప్రతాప్ దొర, తుడుం దెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు, సిద్దబోయిన సర్వేశ్వరరావు, కుచింటీ చిరంజీవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం ప్రకారం ఐదవ షెడ్యూల్ భూభాగంలో పార్లమెంటు, ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నాయని, ఆదివాసి జాతి మనుగడను, అస్తిత్వాన్ని లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వాలు కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడుతున్నాయని వక్తలు ఆరోపించారు.
ఆదివాసి జాతి అస్తిత్వం కోసం, జాతి సంస్కృతి, సాంప్రదాయాల కోసం మానవతావాదులు, బుద్ధిజీవులు, ప్రజాస్వామిక వాదులు, ప్రొఫెసర్లు పోరాట పంథాను అనుసరించి ఆదివాసి జాతి పక్షాన నిలుస్తున్నారని, అలాంటి వ్యక్తులకు ఆదివాసి జాతి కృతజ్ఞులై ఉంటుందని అన్నారు.
ఆదివాసి భూములు అన్యాక్రాంతం కాకుండా బ్రిటిష్ ప్రభుత్వం ఎల్.టి.ఆర్ చట్టం చేసిందని, దానికి సవరణగా గిరిజన భూముల బదలాయింపు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం 1/70 చట్టాన్ని తెచ్చిందని పేర్కొన్నారు. అయినా ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో 70% భూమి గిరిజనేతరుల చేతిలో ఉందంటే, చట్టాలను పక్కా ప్లాన్‌తో పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వాలను కూలదోయాలని డిమాండ్ చేశారు.
ఆదివాసి చట్టాలను నిర్వీర్యం, నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వాలకు ఆదివాసి జాతి పక్షాన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 జీవోను పునరుద్ధరించాలని, ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో సెక్షన్ 5 క్లాస్ 2 ప్రకారం 3 జీవోను చట్టం చేయవచ్చని, ప్రభుత్వం స్పందించి ప్రకృతితో సహజ సిద్ధంగా జీవించే ఆదివాసి జాతి జీవితాలలో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆదివాసి లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై 26న వెంకటాపురం కేంద్రంగా అన్ని ఆదివాసి సంఘాల సమక్షంలో 1/70 చట్టం, 3 జీవో అంశంపై సమావేశం నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి మహిళా శక్తి నాయకులు నయుమా, శంకరమ్మ, తుడుం దెబ్బ మండల అధ్యక్షులు కణితి వెంకటకృష్ణ, కార్యదర్శి సున్నం చంటి, దానమయ్యపేట గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.











