జర్నలిస్టుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ లక్ష్యంగా హైదరాబాద్లో గురువారం జరగనున్న భారీ బహిరంగ సభకు చర్ల మండలంలోని జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలిరావాలని టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కర్ర అనిల్ రెడ్డి పిలుపునిచ్చారు.
చర్ల మండలంలో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో కర్ర అనిల్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమన్న ఆధ్వర్యంలో జరగబోయే ఈ సభ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేలా ఉండాలని ఆకాంక్షించారు.
సమావేశంలో పాల్గొన్న జర్నలిస్టులు వృత్తిరీత్యా ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను చర్చించారు. ఆరోగ్య భీమా, ప్రమాద భీమా సౌకర్యాలు లేకపోవడం, సొంత ఇళ్లు లేకపోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు.
ప్రభుత్వాలు గతంలో హామీ ఇచ్చిన విధంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదా గృహాలను కేటాయించాలని, బెదిరింపులు, దాడుల నుండి రక్షణ కల్పించేలా 'జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్'ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
వయసు పైబడిన, అనారోగ్యంతో ఉన్న జర్నలిస్టులకు గౌరవప్రదమైన పెన్షన్ అందజేయాలని కోరుతూ, సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడాలని, హైదరాబాద్ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.












