ములకలపల్లి, 19 November
రైతులు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం. రాజేందర్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని రైతు వేదికలో గురువారం న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రైతులు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం. రాజేందర్ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని రైతు వేదికలో గురువారం న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
విత్తన చట్టంపై అవగాహన
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎం. రాజేందర్ రైతులకు విత్తన చట్టంపై అవగాహన కల్పించారు. నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం, నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండటం, విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదులు భద్రపరచుకోవడం వంటి అంశాలను వివరించారు. నాణ్యతలేని విత్తనాల వల్ల లేదా ఇతర కారణాలతో పంట నష్టం జరిగినప్పుడు చట్టపరంగా పరిహారం పొందే మార్గాలను తెలియజేశారు. రైతులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సలహాలు, సహాయం పొందవచ్చని తెలిపారు.
బాల్య వివాహాల నిరోధక చట్టం
అనంతరం బాల్య వివాహాల నిరోధక చట్టంపై మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండని బాలికలకు, 21 సంవత్సరాలు నిండని బాలురకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. బాల్య వివాహాల వల్ల బాలల భవిష్యత్తుతో పాటు బాలికల విద్య, ఆరోగ్యం, భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
పోక్సో చట్టం ప్రాముఖ్యత
పిల్లలపై లైంగిక వేధింపులు, దాడులను నిరోధించేందుకు రూపొందించిన పోక్సో చట్టం గురించి కూడా వివరించారు. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, వ్యవసాయ అధికారి అరుణ్ బాబు, వ్యవసాయ విస్తరణ అధికారులు సూరిబాబు, రాహుల్ గాంధీ, సుజాత, సీడీపీవో లలిత, ఎయిడ్ ఎన్జీవో ప్రతినిధులు జ్యోతి, మౌనిక, సర్పంచ్ చంద్రలేఖ, మాధారం సర్పంచ్ సుజాత, వీకే రామవరం సర్పంచ్ ఊకే ఆదిలక్ష్మి, పారాలీగల్ వాలంటీర్లు వీరభద్రం, భిక్షమయ్య, జానకిరాం, రైతులు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


