అమలాపురం, జూన్ 30
మస్కట్‌లో ఉపాధి నిమిత్తం వెళ్లి ఇబ్బందులు పడుతున్న ఎన్. రామేశ్వరం గ్రామానికి చెందిన సి.హెచ్. ధనలక్ష్మిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ చొరవతో సురక్షితంగా స్వదేశానికి తరలించారు. కుటుంబ పోషణ కోసం మస్కట్ వెళ్లిన ధనలక్ష్మి, అక్కడ అధిక పని గంటలు, ఒత్తిడి, అనారోగ్యంతో బాధపడింది.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఎన్. రామేశ్వరం గ్రామానికి చెందిన సి.హెచ్. ధనలక్ష్మి మస్కట్‌లో ఉపాధి నిమిత్తం వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ చొరవతో ఆమెను సురక్షితంగా భారతదేశానికి రప్పించారు.
ధనలక్ష్మి కుటుంబ పోషణ కోసం 2026 ఏప్రిల్ 13న విజయవాడకు చెందిన ఏజెంట్ పి. సునీత ద్వారా మస్కట్‌కు వెళ్లారు. అక్కడ అధిక పని గంటలు, తీవ్రమైన పని ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడటంతో స్వదేశానికి రావాలని కోరుకున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అమలాపురం కలెక్టరేట్లోని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (KCM)ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశాల మేరకు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు సంబంధిత ఏజెంట్, యజమాని మరియు ఇతర సంబంధిత వర్గాలతో నిరంతరం సమన్వయం చేస్తూ అవసరమైన చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యుల సహకారంతో ధనలక్ష్మిని క్షేమంగా భారతదేశానికి రప్పించడంలో విజయవంతమయ్యారు.
ఈ సందర్భంగా కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ నోడల్ అధికారి వి. సుబ్బారావు మాట్లాడుతూ విదేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొందిన రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారానే వెళ్లాలని సూచించారు. ఉద్యోగ వివరాలు, వేతనం, ఒప్పంద నిబంధనలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే విదేశాలకు వెళ్లాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే జిల్లా యంత్రాంగం లేదా కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను సంప్రదిస్తే అవసరమైన సహాయం అందజేస్తామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ సత్వర స్పందనతో ధనలక్ష్మి సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్‌తో పాటు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ నోడల్ అధికారి వి. సుబ్బారావు, సమన్వయకర్త గోళ్ళ రమేష్, బి. నాగరాజు (మస్కట్), కడియాల సత్తిబాబు, షేక్ బీబి సఫియా తదితరులు పాల్గొన్నారు.






