వెంకటాపురం, 19 November
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులపై దాడులు, హత్యలు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టాలని, కర్రిగుట్టల్లో ఆదివాసుల భూములకు రీ సర్వే చేసి హక్కులు కల్పించాలని ములుగు జిల్లా అధ్యక్షుడు కనితి శేషారావు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం వెంకటాపురం మండలం బోధపురం గ్రామంలో గురువారం ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులపై దాడులు, హత్యలు పెరుగుతున్నాయని, వాటిని అరికట్టాలని, కర్రిగుట్టల్లో ఆదివాసుల భూములకు రీ సర్వే చేసి హక్కులు కల్పించాలని ములుగు జిల్లా అధ్యక్షుడు కనితి శేషారావు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధపురం గ్రామంలో గురువారం ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. భద్రాచలం లాడ్జిలో జరిగిన తెల్లం శరత్ హత్య కేసులో నిందితులపై కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసులపై దాడులు, హత్యలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, నిందితులకు అండగా నిలుస్తున్నాయని ఆయన విమర్శించారు. ఆదివాసుల సంక్షేమం, చట్టాలు, హక్కుల అమలు కోసం కృషి చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, ఆచరణలో ఆదివాసులపై దాడులు, హత్యలను అరికట్టడంలో విఫలమవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆదివాసుల హక్కుల పరిరక్షణ పేరుతో హామీలు ఇస్తూ ఓట్లు పొందుతున్నారని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ద్వారా ప్రత్యేక హక్కులు కల్పించారని, స్వయం పాలన కోసం ఎల్టీఆర్ 1/70 చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టం అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ మైదాన ప్రాంతాల నుంచి గిరిజనేతరులు ఏజెన్సీ ప్రాంతాలకు వలస వచ్చి ప్రభుత్వ భూములు, ఆదివాసుల పట్టా భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీల అండతో, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ భూములను ఆక్రమించడంతో పాటు, ఎల్టీఆర్ 1/70 చట్టం నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చెల్లించి అక్రమ పట్టాలు పొందుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అక్రమ పట్టాలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
వాజేడు, మండలాల పరిధిలోని కర్రిగుట్టల్లో గతంలో ఆదివాసులు నివసిస్తూ వ్యవసాయం చేసుకున్నారని కనితి శేషారావు తెలిపారు. పామునూరు, జెల్ల, డోలిముకు, నూరు, షలిమల, తడపల గ్రామాల్లో ఆదివాసులు నివసించిన సమయంలో వారు సాగు చేసుకుంటున్న భూములకు అప్పటి ప్రభుత్వం యాజమాన్య హక్కు పట్టాలు కల్పించిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ భూములకు రీ సర్వే నిర్వహించి, ఆదివాసుల సాగు హక్కులను గుర్తించాలని కోరారు. ఆయా భూములను తిరిగి ఆదివాసులకు అప్పగించి వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెల్లం ఆనంద్ కుమార్, సబ్కా సాయికుమార్, కోర్స నాగేంద్రబాబు, పూనెం రామారావు, సోడి ప్రశాంత్, సోడి బాలకృష్ణ, పూనెం నరసింహారావు, సోడి నాగ, ప్రశాంత్, చందు తదితరులు పాల్గొన్నారు.



