Charla, 2026-11-20
చర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని విద్యార్థి రక్షణ సంఘం డివిజన్ అధ్యక్షులు బోయిళ్ల సాంబశివరావు డిమాండ్ చేశారు. శుక్రవారం కళాశాల నాయకులు సందర్శించి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.
చర్ల మండల కేంద్రంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తక్షణమే ఏర్పాటు చేసి, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని విద్యార్థి రక్షణ సంఘం డివిజన్ అధ్యక్షులు బోయిళ్ల సాంబశివరావు డిమాండ్ చేశారు.
శుక్రవారం చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలను విద్యార్థి రక్షణ సంఘం నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ, క్రమం తప్పకుండా కళాశాలకు హాజరై ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
వెంకటాపురం, వాజేడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అనేకమంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలంటే చర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం విద్యార్థులు, ప్రజలు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నప్పటికీ పాలకుల నుంచి సరైన స్పందన రావడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరిస్తున్నాయని అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైతం ఇచ్చిన హామీని ఇప్పటివరకు అమలు చేయలేదని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థులు, ప్రజలు, మేధావులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి రక్షణ సంఘం నాయకులు రుద్ర, ప్రశాంత్, గోవింద్, కృపాకర్తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.







