చర్ల ప్రభుత్వాసుపత్రిలో గిరిజన ఉపాధ్యాయుడిపై వైద్యుడు కృష్ణ ప్రసాద్ దురుసుగా ప్రవర్తించారని, అతనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ జిల్లా కలెక్టర్‌ను కోరింది.
వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన ఉపాధ్యాయుడు పలక నాగేశ్వరావును డాక్టర్ కృష్ణ ప్రసాద్ అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు, సెక్యూరిటీ గార్డు సహాయంతో చేతులు విరిచి, చంపలపై దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. ఈ సంఘటనపై స్పందించిన జేఏసీ నాయకులు, డాక్టర్ కృష్ణ ప్రసాద్‌ను తక్షణమే సస్పెండ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైద్య వృత్తికే మచ్చ తెస్తున్న డాక్టర్ కృష్ణ ప్రసాద్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, రోగులను ప్రేమగా చూడలేని వైద్యుడు రోగితో సమానమని జేఏసీ నాయకులు అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్యులు ప్రజలతో సన్నిహితంగా ఉంటూ, ప్రేమగా వ్యవహరిస్తూ వైద్యం చేయాలని, కానీ వృత్తి ధర్మాన్ని మరచి రోగులపై దౌర్జన్యానికి పాల్పడుతున్న డాక్టర్ కృష్ణ ప్రసాద్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని వారు కోరారు.
ఈ డిమాండ్ల నేపథ్యంలో, సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆదివాసి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.










