అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో అదృశ్యమైన ముగ్గురు మైనర్ బాలికలను పోలీసులు గంట వ్యవధిలోనే సురక్షితంగా గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ మీనా పోలీసుల చాకచక్యాన్ని ప్రశంసించారు.
రాజోలు పరిధిలోని నున్నవారి బడువ, అడవివారిపాలెం ప్రాంతాలకు చెందిన 14, 15, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలికలు శుక్రవారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులకు ఇష్టం లేని వ్యక్తి ఇంటికి వెళ్లిన విషయమై ఒక బాలికను ఆమె తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.
రాత్రి వరకు బాలికలు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రాత్రి 9.30 గంటల సమయంలో రాజోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే రాజోలు ఎస్ఐ పి. మల్లికార్జున రెడ్డి తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి, నున్నవారి బడువ వైపు బాలికలు వెళ్లినట్లు గుర్తించారు.
స్థానికుల సహకారంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికే బాలికలను గుర్తించి, వారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. మైనర్ బాలికల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించి, అత్యంత వేగంగా స్పందించిన రాజోలు ఎస్ఐ పి. మల్లికార్జున రెడ్డి, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
తమ పిల్లలను క్షేమంగా గుర్తించి అప్పగించిన రాజోలు పోలీసులకు, అలాగే ప్రత్యేక శ్రద్ధ చూపిన జిల్లా ఎస్పీకి బాలికల తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.












