హైదరాబాద్, 2 July
ఉపాధి కోసం నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నించిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ ఏజెంట్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని నకిలీ వీసాలతో మోసం చేశాడని బాధితులు తెలిపారు.
నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. ఒమన్ ఎయిర్వేస్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మహిళల వీసాలు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ తనిఖీల్లో నకిలీవని అధికారులు గుర్తించారు.
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేందుకు ఒక ట్రావెల్ ఏజెంట్‌ను ఆశ్రయించగా, తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి నకిలీ వీసాలతో మోసం చేశాడని బాధితులైన మహిళలు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు, మహిళలను మోసం చేసిన ముఠా, ఏజెంట్ ఎవరనే కోణంలో ముమ్మర దర్యాప్తు చేపట్టారు.












