ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం గ్రామంలో జరిగిన బంగారు నగల దొంగతనం కేసులో పోలీసులు ఒక మహిళను అరెస్ట్ చేశారు. దొంగిలించబడిన 18 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను అమలాపురం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ శుక్రవారం సాయంత్రం వెల్లడించారు.
ఎస్.యానం గ్రామానికి చెందిన చిలుకూరి రాంబాబు, అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య అనంతలక్ష్మి చికిత్స నిమిత్తం విశాఖపట్నం జిల్లా మధురవాడలో నివాసం ఉంటున్నారు. అక్కడ ఇంటి పనుల సహాయకురాలిగా, అనంతలక్ష్మికి సేవ చేయడానికి విజయనగరం జిల్లాకు చెందిన బోనంగి శాంతి అలియాస్ వర్షిణిని నియమించుకున్నారు. అనంతలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడటంతో కుటుంబం ఇటీవల తిరిగి ఎస్.యానం గ్రామానికి వచ్చింది. శాంతిని కూడా కొంతకాలం సహాయం కోసం వారితో పాటు తీసుకువచ్చారు. మూడు రోజుల అనంతరం శాంతి తన స్వగ్రామానికి వెళ్లిపోయింది.
ఆ తరువాత ఇంట్లోని బీరువా తాళాలు కనిపించకపోవడాన్ని రాంబాబు గమనించారు. అయితే, ఆభరణాల అవసరం లేకపోవడంతో బీరువాను తెరవలేదు. గత నెల 23న ఒక శుభకార్యానికి వెళ్లేందుకు ఆభరణాలు అవసరం కావడంతో బీరువా తాళం పగులగొట్టి చూడగా, అందులో ఉన్న 18 కాసుల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన రాంబాబు, తన సహాయకురాలిగా పనిచేసిన శాంతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, శాంతిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వద్ద నుంచి 18 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేసి అమలాపురం కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.
ఈ కేసును చాకచక్యంగా ఛేదించి, తక్కువ సమయంలోనే బంగారు నగలను రికవరీ చేసిన అమలాపురం రూరల్ సీఐ డి. ప్రశాంత్ కుమార్, ఎస్ఐ ఎస్కే జానీ బాషా, హెడ్ కానిస్టేబుళ్లు బీవీ గిరి, కె. హరినాథ్, కానిస్టేబుళ్లు వి. నాగరాజు, ఎస్డీ కరీం చంద్, మహిళా కానిస్టేబుల్ ఆర్. కనకదుర్గలతో కూడిన బృందాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.










