చర్ల మండలం, R కొత్తగూడెం SC కాలనీలో ఇటీవల గాలిదుమారాలకు కూలిపోయిన రేకుల షెడ్డు ఇంటి యజమానులకు 'మీకోసం మేమున్నాం టీం' ఆర్థిక సహాయం అందించింది.
కూరపాటి వెంకటేశ్వరరావు, శ్రీదేవి దంపతులు నివాసం ఉంటున్న రేకుల షెడ్డు ఇల్లు గాలిదుమారాల కారణంగా ధ్వంసమైంది. రోజువారీ కూలీతో జీవించే ఈ కుటుంబం, నిలువ నీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇంటిని పునర్నిర్మించుకునే స్తోమత లేకపోవడంతో, వారు 'మేమున్నాం టీం'ను ఆశ్రయించారు.
టీం సభ్యులు వాట్సాప్ గ్రూపుల ద్వారా నిధుల సేకరణ చేపట్టగా, రూ. 9,500/- జమ అయ్యాయి. ఈ మొత్తాన్ని టీం సభ్యులు కార్తికేయ, రోహిత్ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా టీం చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాల వల్ల కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం సామాజిక బాధ్యత అని, అందరూ కలిసి సహాయం చేస్తే బాధితులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీం సభ్యులు పాల్గొన్నారు.









