అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో యోగా సాధన సమితి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. యోగా యొక్క ప్రాముఖ్యత, దాని ప్రయోజనాలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు.
మల్లాది శ్రీరామ్ మూర్తి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ కీర్తి సురేష్ యోగాసనాలను ప్రత్యక్షంగా చేసి చూపించారు. సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటిపై వివరణ ఇచ్చారు.
శ్రీరామ్ మూర్తి మాట్లాడుతూ, యోగా ప్రకృతి ప్రసాదించిన వరమని, ఆరోగ్యాన్ని, ఆయుర్దాయాన్ని పెంచడంలో అష్టాంగ యోగ నియమాలు, యోగాసనాలు, ప్రాణాయామం కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ యోగా, ఆయుర్వేద పద్ధతులను అనుసరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రతిరోజూ ఉదయం 6 నుండి 7 గంటల వరకు కళాశాల ఆవరణలో యోగా కార్యక్రమం జరుగుతుందని, అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చర్ల మండల వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, యువత, యోగ సాధన సమితి సభ్యులు, మహిళా సభ్యులు వెంకటరమణ, స్వాతి తదితరులు పాల్గొన్నారు.












